Adilabad News: పేరుకే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సేవలు శూన్యం- అమలుకు నోచుకోని మంత్రి హరీష్ రావు హామీ!
రూ.150 కోట్ల భారీ ఖర్చుతో హాస్పిటల్ నిర్మించినా, మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదన్నారు.
ఆదిలాబాద్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించినా, సేవలు శూన్యం అని బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి అన్నారు. రూ.150 కోట్లు వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలు, మెషినరీలు, కార్పొరేట్ ఆసుపత్రికి తీసిపోని విధంగా 210 పడకలు, 50 ఐసీయు పడకలు,7 ఆపరేషన్ థియేటర్లతో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు అందిస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారని గుర్తుచేశారు. ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి మంగళవారం సందర్శించారు.
భారీగా ఖర్చు చేసి హాస్పిటల్ నిర్మించినా, మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదన్నారు జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి. రూ.150 కోట్లతో నిర్మించిన ఆదిలాబాద్ ఆసుపత్రి అలంకార ప్రాయంగా మారి పేదలకు ఉపయోగపడనిదిగా మిగిలిందన్నారు- బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న సేవలు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా చిట్యాల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ... ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వైద్యశాఖ మంత్రి హరీష్ రావ్ అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
రూ.11 కోట్ల రూపాయల క్యాత్ లాబ్ ఉన్నా, 2 D ఈకో, అంజియోగ్రాం, స్టంటు, లాంటి వైద్య సదుపాయాలు కేవలం కార్డియాలజిస్ట్ లేకపోవడంతో రోగులకు అందడం లేదని ఆరోపించారు. జిల్లాలో సుదూర ప్రాంతాలకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల సామాన్యులకు లక్షల్లో ఖర్చు అయ్యి ఆర్థిక భారంతో పేదలు చితికి పోతున్నారన్నారు. డయాలసిస్ కోసం ఆధునిక మెషీన్లు 10 ఉండి కూడా డాక్టర్ లేకపోవడంతో, కిడ్నీ ట్రాన్సప్లాంట్టేషన్ కి కావలసిన సెటప్ ఉంది కానీ డాక్టర్లు లేక సేవలు అందడం లేదన్నారు సుహాసిని రెడ్డి.
హరీష్ రావు గత ఏడాది ప్రకటించిన ఎంఆర్ఐ ఇంకా రాలేదన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్ పోస్టులు అమ్ముకోవడం మీద ఉన్న శ్రద్ధ.. డాక్టర్లను నియమించడం మీద లేకపోవడం స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న చిత్తశుద్దికి నిదర్శనం అన్నారు. లిమ్కా బుక్ కోసం కేసీఆర్ ని కలిసిన రామన్న వెంటనే డాక్టర్ల కోసం ముఖ్యమంత్రిని కలవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆసుపత్రిలో వైద్యులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ జిల్లా నాయకులు, కీలక నేతలు పాల్గొన్నారు.