By: ABP Desam | Updated at : 20 Apr 2023 09:50 AM (IST)
ఎరుపెక్కిన ఆ పిడికిలికి 42 ఏళ్లు- గిరిజనుల గుండెల్లో మానని ఇంద్రవెల్లి గాయాలు
హక్కుల కోసం పోరాడి ప్రాణలు వదిలిన అడవి బిడ్డల పోరాటానికి 42 ఏళ్లు. భూమి కోసం భుక్తి కోసం పిడికిలి బిగించి కన్నుమూసిన వారిని స్మరించుకుంటోంది గిరిజనం. జలియన్ వాలాబాగ్‌ను తలపించేలా సాగిన మారణకాండను తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంటోంది.
భవిష్యత్ తరాల బాగు కోసం ప్రాణాలను ధారపోసిన వారిని స్మరించుకుంటున్నారు గిరిపుత్రులు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులార్పిస్తున్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణలో కూడా అన్యాయమే జరుగుతోందని వాపోతున్నారు.
జల్ జంగల్ జమీన్... అడవి నీరు భూమిపై తమకే హక్కు ఉందని తిరుగబడ్డారు నాటి ఆదివాసీలు. రాజ్యాంగబద్దమైన హక్కును ప్రభుత్వాలకు తెలియజేస్తూ రైతు కూలీ సంఘం పోరుబాట పట్టింది. ఈ సభలోనే తుపాకులు గర్జించాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న రైతు సంఘాలు చేప్టటిన సభకు నాటి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సభకు పర్మిషన్ లేదని చెప్పిన పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఇవేమీ తెలియని ఆదివాసీలు సభకు భారీగా తరలి వచ్చారు.
ఇలా సభకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఓ ఆదివాసీ మహిళలపై పోలీసు చేయి చేసుకున్నాడని ఆమె తిరగబడింది. తనపై అకారణంగా చేయి వేశాడని కొడవలితో వేటు వేసింది. ఈ ఒక్క ఘటనతో ఇంద్రవెల్లి రక్తసిక్తమైంది.
రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పోలీసులకు ఆదివాసీలకు మధ్య జరిగిన ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు నాటి ఆర్డీవో కాల్పులకు ఆదేశించారు. దీంతో ఇంద్రవెల్లి రణవెళ్లిగా మారిపోయింది. పోలీసుల కాల్పులతో రక్తపుటేర్లు పారాయి.
ఆ రోజు జరిగిన ఘటన దేశంలోనే సంచలనం సృష్టించింది. గిరిజనులతోపాటు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అడవి బిడ్డల్లో దాగి ఉన్న చీకటిని తరిమికొట్టేందుకు ఐక్యంగా ఉద్యమించాలన్న సంకల్పం మహా ఉద్యమానికి దారి తీసింది. అదే ప్రజల ప్రాణాలు తీసింది. ఇంద్రవెల్లిలో జరిగిన సభలో ఓ పోలీసు ఆదివాసీ మహిళపై ప్రవర్తించిన అసభ్యకర ప్రవర్తన హింసకు దారితీసింది. పోలీసులు తుపాకులు తూటాలతో పోరాడితే ఆదివాసీలు తమతో తెచ్చుకున్న బరిసెలు కొడవళ్లు గొడ్డళ్లతో విరుచుకుపడ్డారు. యావత్ దేశాన్ని కుదిపేసిన ఈ ఘటన విప్లవకారుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.
ఆదివాసీలు చేసిన పోరాటానికి స్ఫూర్తింగా 1986లో ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మించారు. 1987లో దీన్ని గుర్తు తెలియని వ్యక్తులు పేల్చేశారు. ఇది మరో ప్రమాదానికి కారణం కాకుండా ఆనాటి ప్రభుత్వం ఇంద్రవెల్లిలో భారీ స్థూపాన్ని నిర్మించింది. అయితే మారిన పరిస్థితులు కారణంగా 1989 నుంచి 1995 వరకు మావోయిస్టుల ప్రభావం ఉండటంతో ప్రభుత్వం ఏప్రిల్ 20న వేడుకలు చేసుకోవడం నిషేధించింది.
అందుకే ఏప్రిల్ 20 వచ్చిందంటే పోలీసుశాఖ టెన్షన్ మామూలుగా ఉండేది కాదు. ఆ రోజు మావోయిస్టులు కూడా విధ్వంసాలకు పాల్పడేవాళ్లు. దీంతో పోలీసులు ప్రతి ఏడాది భారీ బందోబస్తు ఏర్పాటు చేసేవాళ్లు. ప్రభావిత ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించేవాళ్లు.
హక్కుల కోసం అసువులు బాసిన ఆదివాసీల సమస్యలు నేటికీ తీరలేదు. 42 ఏళ్ల క్రితం జరిగిన మారణకాండ నేటికీ సజీవంగానే ఆదివాసీల మనస్సులో ఉండిపోయింది. ఆదివాసీలే సాంప్రదాయబద్దంగా స్థూపం వద్ద నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొంత మేర ఆంక్షలను సడలించారు.
ఆనాటి కాల్పుల్లో మరణించిన, గాయపడ్డ ఆ కుటుంబాలకు ఏ ప్రభుత్వాలు ఆదుకోలేదని వాపోతున్నారు గిరిజనులు. ఇప్పటికైనా సహయం చేస్తే బాగుంటుందని వేడుకుంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో తమకు తమ హక్కులను కల్పించే దిశగా కృషి చేయాలని కోరుతున్నారు. ఇంద్రవెల్లి ఘటన జరిగి 42ఏళ్ళు గడిచినా సరైన ఫలాలు అందడం లేదంటున్నాయి గిరిజన సంఘాలు. అడవుల్లోకి ఆదివాసీలను రానివ్వడం లేదని వాపోతున్నారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు.
ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో 2019 లో తొలిసారిగా ఎంపి సోయం బాపురావ్ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 20 మంది అమరవీరుల కుటుంబాలకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహయం అందజేశారు. ఆనాటి నుంచి నేటి వరకు ఎవరు వారికి సహయం చేయలేదు.
1981 ఎప్రిల్ 20 న ఇంద్రవెల్లి కాల్పుల్లో గాయపడ్డా మడావి జంగుబాయి, కినక మాన్కుబాయి, సిడాం భీంరావ్ తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆనాడు కాల్పులు ఎలా జరిగాయో ప్రత్యక్షంగా ఉన్న వీళ్ళు తెలుగు భాష సరిగ్గా రాకున్న నాటి ఘటనను వెల్లడించారు. ఇంద్రవెల్లి కాల్పుల్లో కన్నాపూర్ గ్రామానికి చెందిన మడావి జంగుబాయి కుడి చేతి కండపై బుల్లెట్ గాయమైంది. పిట్టబొంగరం గ్రామానికి చెందిన కినక మాన్కుబాయికి ఎడమ భంజంపై గాయమైంది. వంకతుమ్మ గ్రామానికి చెందిన సిడాం భీంరావ్ కుడికాలు, తలపై బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయన గతేడాది అనారోగ్యంతో మరణించారు.
ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తమకు బుల్లెట్ గాయాలై నేటికి 42ఏళ్ళు గడిచిన ఏ ఒక్కరు ఆదుకోవడంలేదని కాల్పుల్లో గాయపడ్డా ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఆదివాసీ సాంప్రదాయాలతో ఘనంగా నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయ సాధన కమిటీ చైర్మెన్ తొడసం నాగోరావ్ తెలిపారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మీల కూడా వెళ్తున్నట్టు నాయకులు తెలిపారు. స్థానిక ఎంపి సోయం బాపురావ్‌తోపాటు జిల్లా ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొనబోతున్నారు.
PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!
Bandi Sanjay - Kavitha: నిజామాబాద్‌లో ఆసక్తికర సీన్! ఆత్మీయంగా పలకరించుకున్న బండి సంజయ్, కల్వకుంట్ల కవిత
RTO Vehicle Registration: రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, సర్వర్ డౌనే కారణం
Eklavya Model Schools Results: ఏకలవ్య గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
TS Police Training: ఎస్‌ఐ, కానిస్టేబుల్ శిక్షణకు ఏర్పాట్లు, జులై నుంచి అభ్యర్థులకు ట్రైనింగ్!
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!