Nizamabad News : బోధన్ లో హైటెన్షన్, శివాజీ విగ్రహం ఏర్పాటుతో వివాదం, 144 సెక్షన్ విధింపు
Nizamabad News :నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఉద్రిక్తత నెలకొంది. శివాజీ విగ్రహం ఏర్పాటుతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఆందోళనకారులు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు.
Nizamabad News : నిజామాబాద్ జిల్లా బోధన్ లో హైటెన్షన్ నెలకొంది. శివాజీ విగ్రహం ఏర్పాటుతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. బీజేపీ, శివసేన కార్యకర్తలు శనివారం రాత్రి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మరో వర్గం విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తుంది. విగ్రహాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. విగ్రహాన్ని తొలగించే ప్రసక్తే లేదని బీజేపీ, శివసేన కార్యకర్తలు పట్టుబడుతున్నారు. దీంతో బోధన్ లో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు.
ఇరువర్గాలకు నచ్చచెబుతున్న పోలీసులు
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని ప్రధాన జంక్షన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం ఈ వివాదానికి మూలం అయింది. శివసేన, బీజేపీ కార్యకర్తలు రాత్రికి రాత్రి శివాజీ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. దీంతో మైనార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి ఇరువర్గాల నాయకులు, స్థానిక ప్రజలు భారీగా చేరుకున్నారు. ఘర్షణ నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కాసేపు లాఠీఛార్జ్ చేశారు. ఇరువర్గాలకు నచ్చ చెప్పేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
భారీగా పోలీసుల మోహరింపు
బీజేపీ, శివసేన కార్యకర్తలు, మైనార్టీ నాయకులు భారీగా అంబేడ్కర్ జంక్షన్ వద్దకు చేరుకున్నారు. ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఒక సమయంలో ఆగ్రహంతో ఇరు వర్గాలు రాళ్లదాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపుచేసుందుకు పోలీసులను భారీగా మోహరించారు. సీపీ రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. విగ్రహం ఏర్పాటుకు అధికారుల అనుమతి తప్పనిసరి అని సీపీ నాగరాజు చెప్పారు. విగ్రహం ఏర్పాటు విషయంలో ఇరు వర్గాలను పిలిచి మాట్లాడామని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పలువురు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. అక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.