Jubilee Hills Accident : జూబ్లీహిల్ రోడ్డు ప్రమాదం, కారులో ఎమ్మెల్యే కుమారుడు, మద్యం తాగి ఉండకపోవచ్చు - ఏసీపీ సుదర్శన్
Jubilee Hills Accident : జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంపై పోలీసులు షాకింగ్ వివరాలు తెలిపారు. ప్రమాద సమయంలో బోధన్ ఎమ్మెల్యే కుమారుడు రహీల్ కారులోనే ఉన్నాడని తెలిపారు. ప్రస్తుతం అతడు ఎక్కడ ఉన్నాడో తెలియదన్నారు.
Jubilee Hills Accident : జూబ్లీహిల్స్ లో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన కారులో ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ కూడా ఉన్నాడని బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. గురువారం రాత్రి 8 గంటల ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారని తెలిపారు. ఈ ప్రమాదంలో రెండేళ్ల బాబు చనిపోయాడని, క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించామన్నారు. రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలో మహిళలను కారు ఢీకొందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేశామని వెల్లడించారు. ప్రమాదం సమయంలో కారు ఎవరు నడిపారన్న కోణంలో దర్యాప్తు చేశామని ఏసీపీ సుదర్శన్ తెలిపారు. దర్యాప్తు కోసం నాలుగు టీంలను ఏర్పాటు చేశామని, వంద కెమెరాలు జల్లెడ పట్టామన్నారు.
బాధితులు ఎక్కడికి వెళ్లారో సమాచారం లేదు
"అఫ్రాన్, రహీల్, మహమ్మద్ మాజ్ ముగ్గురు కారులో ఉన్నారు. మెక్ డోనాల్డ్ లో తిని జూబ్లీహిల్స్ రోడ్ 45 వైపు వచ్చారు. ప్రమాద సమయంలో అఫ్రాన్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నాడు. ఫింగర్ ప్రింట్స్ చెక్ చేశాం. అఫ్రాన్ ఫింగర్స్ ప్రింట్స్ తో సరిపోలాయి. అతన్ని అరెస్ట్ చేశాం. నడిపింది ఎవరు అని తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. అక్కడి సాక్షులు డ్రైవర్ ను గుర్తించారు. డ్రైవర్ ఏ డైరెక్షన్ లో పారిపోయాడో ఆ డైరెక్షన్ ఫోన్ సిగ్నల్స్ చెక్ చేశాం. దీంతో అఫ్రాన్ కారు డ్రైవ్ చేసినట్టు కన్ఫర్మ్ చేసుకున్నాం. బాధితులు ఎక్కడికి వెళ్లారో మాకు సమాచారం లేదు. బిల్లు కట్టే వారు ఎవరు లేకపోవడంతో బాధితులను అపోలో నుండి నిమ్స్ కు తరలించాం. బాధితులు బాబు డెడ్ బాడీ తీసుకుని ఊరికి వెళ్లిపోయారు." అని ఏసీపీ సుదర్శన్ అన్నారు.
రహీల్ ఎక్కడున్నాడో తెలియదు
రహీల్ ఎక్కడున్నాడో తెలియలేదని ఏసీపీ సుదర్శన్ తెలిపారు. తానే డ్రైవ్ చేశానని అఫ్రాన్ చెప్పాడని, అతన్ని విచారిస్తే నిజం చెప్పాడన్నారు. అఫ్రాన్ డ్రైవ్ చేస్తే, రహీల్ పక్కన కూర్చున్నాడని చెప్పారు. అఫ్రాన్ ను అదుపులోకి తీసుకున్నామని, మిగతా ఇద్దరిని పంపించేశామని తెలిపారు. ప్రమాద సమయంలో మద్యం తాగి ఉండకపోవచ్చు అని భావిస్తున్నామన్నారు. కేసుకు అవసరం ఉన్న ఆరుగురి స్టేట్మెంట్ తీసుకున్నామని పోలీసులు తెలిపారు. బ్లాక్ ఫిల్మ్ , స్టిక్కర్స్ పై ప్రత్యేక డ్రైవ్ పెడుతున్నామని వెల్లడించారు.