Nizamabad News : ఉపాధ్యాయ బదిలీల్లో తీరని స్పౌజ్ కష్టాలు, ఖాళీలున్నా పట్టించుకోని విద్యాశాఖ!
Nizamabad News : ఉపాధ్యాయ దంపతులను ఒకే జిల్లాకు ట్రాన్స్ ఫర్ చేసే ప్రక్రియ నిలిచిపోవడంతో టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భర్త ఒక జిల్లాలో భార్య మరో జిల్లాలో విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన చెందుతున్నారు.
Nizamabad News : నిజామాబాద్ జిల్లాలో భార్యభర్తలు ప్రభుత్వ టీచర్లుగా ఉన్న వారికి ఇబ్బందులు తప్పడంలేదు. భర్త ఒక జిల్లాలో విధులు నిర్వహిస్తుంటే భార్య మరో జిల్లాలో వందలాది కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తున్నారు. పిల్లల బాగోగులు, తల్లిదండ్రులు, అత్తమామలను చూసుకోనే సమయం లేక ఉపాధ్యాయ దంపతులు మానసిక వేదనకు గురవుతున్నారు. స్పౌజ్ బదిలీలు నెలలుగా పెండింగ్ ఉండడం, భవిష్యత్తులో బదిలీలు జరుగుతాయో లేవో తెలియక ఉపాధ్యాయ వర్గాలలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. బ్లాక్ చేసిన 13 జిల్లాలలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నా విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 146 ఉపాధ్యాయ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.
బ్లాక్ లిస్ట్ లో 13 జిల్లాలు
నూతన జోనల్ వ్యవస్థలో భాగంగా ఉపాధ్యాయ క్యాడర్ విభజన పూర్తయిన తరువాత సీనియారిటీ ప్రతిపాదికన బదిలీలు చేపట్టారు. జీవో నెంబరు 317 ప్రకారం బదిలీల్లో భాగంగా వేర్వేరు జిల్లాలకు కేటాయించిన ఉద్యోగ, ఉపాధ్యాయ దంపతుల బదిలీలను 19 జిల్లాల్లో నిర్వహించి, 13 జిల్లాలను బ్లాక్ లిస్ట్ లో చేర్చారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దంపతులైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకచోట పనిచేసే విధంగా బదిలీలు నిర్వహిస్తామని అప్పట్లో ప్రకటించారు. దానికనుగుణంగా మోమో నెంబర్ 1655 కూడా విడుదల చేశారు. దీని ప్రకారం దంపతులైన ఉపాధ్యాయులు కోరుకున్న జిల్లాకు కేటాయించిన తర్వాత మిగిలిన వారికి జిల్లాల కేటాయింపు ప్రక్రియ జరపాలి. అయితే ఖాళీలు లేవన్న సాకుతో 13 జిల్లాలో స్పౌజ్ బదిలీలు నిలిపివేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 146 ఉపాధ్యాయ దంపతుల బదిలీలు ఆగిపోయాయి. భార్యాభర్తలు చెరొక జిల్లాలో పనిచేయడంతో పిల్లల బాగోగులు, చదువులు, అత్తమామలు, తల్లిదండ్రులు ఆరోగ్యాలను పట్టించుకునే సమయం లేక ఉపాధ్యాయ, ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఒత్తిడి బోధనపై పడి ప్రభావం చూపుతుంది.
ఖాళీలు ఉన్నా
నిజామాబాద్ జిల్లాలో అన్ని క్యాడర్లను కలుపుకొని 1012 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. జిల్లాల కేటాయింపు అనంతరం స్పౌజ్ కేటగిరిలో నిజామాబాద్ జిల్లాకు రావడానికి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు కేవలం 146 మంది మాత్రమే ఉన్నారు. వీరిని సొంతజిల్లాకు తీసుకురావడానికి ఖాళీల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ విద్యాశాఖ వింత వైఖరితో జిల్లాను బ్లాక్ లిస్ట్ పెట్టడంతో ఉపాధ్యాయ దంపతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. బ్లాక్ లిస్ట్ తొలగించి మిగిలిన జిల్లాల్లో బదిలీలు పూర్తి చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.