Mla Jeevan Reddy : బీఆర్ఎస్ రైతు బంధు పార్టీ, బీజేపీ రైతు రాబందు పార్టీ - జీవన్ రెడ్డి
Mla Jeevan Reddy : తెలంగాణ రైతులపై మోదీ సర్కార్ కక్ష గట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. కల్లాల నిధులు తిరిగి చెల్లించాలని కొర్రీలు పెడుతోందని మండిపడ్డారు.
Mla Jeevan Reddy : బీజేపీ ముమ్మాటికీ గుజరాతీ బేరగాళ్ల పార్టీయే తప్ప రైతులను ఉద్దరిచ్చే పార్టీ కాదన్నారు పీయూసీ ఛైర్మన్, నిజామాబాద్ జిల్లా బీఆరెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా నిజామాబాద్ నగరంలోని ఓల్డ్ కలెక్టరేట్ వద్ద బీఆరెస్ రైతు మహా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని జీవన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రైతులపై మోదీ సర్కారు కక్ష గట్టిందన్నారు. రైతులకు కల్లాలు కట్టడం తప్పని బీజేపీ అంటోందన్నారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలలో ఉపాధిహామీ కింద కల్లాల నిర్మాణం జరుగుతుంటే.. తెలంగాణ విషయంలో మాత్రమే ఎందుకింత సవతి తల్లి ప్రేమ? అని ప్రశ్నించారు. పెరిగిన సాగునీటి వసతుల వల్ల పంటల ఉత్పత్తి పెరిగి కల్లాలు లేక రైతులు ధాన్యం రోడ్ల మీద పోసుకుంటున్నారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పార్లమెంటులో ప్రధాని మోదీ అపహాస్యం చేశారని గుర్తుచేశారు. తప్పనిసరి పరిస్థితులలో దానిని కొనసాగిస్తున్నారన్నారు. ఉపాధి ఏ రంగంలో లభించినా ప్రోత్సహించాలని జీవన్ రెడ్డి సూచించారు. సాగునీటి రాకతో సేద్యం పెరిగి తెలంగాణలో పనులు పెరిగాయని, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలసలు పెరుగుతున్నాయన్నారు.
కనీస మద్దతు ధరల చట్టం ఏమైంది?
"వ్యవసాయ రంగంలో కూలీల కొరత వస్తుందని గ్రహించి మొట్టమొదట వ్యవసాయానికి ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. 2014, 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు, సాగు ఖర్చులు పెంచారు. దీంతో రైతులు కష్టాలు పడుతున్నారు. 60 ఏళ్లు నిండిన రైతులకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. రూ.లక్ష కోట్లతో వ్యవసాయంలో మౌలిక సదుపాయాల కల్పన చేస్తామన్న హామీ ప్రకటనలకే పరిమితం అయింది. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని 2013 సెప్టెంబరులో గాంధీనగర్ లో జరిగిన సదస్సులో మోదీ స్వయంగా ప్రకటించారు. స్వామినాథన్ సిఫార్సులకు భిన్నంగా కొత్త ఫార్ములాను అమలుచేస్తూ మద్దతుధర ఇస్తున్నామని రైతులకు శఠగోపం పెట్టారు. కనీస మద్దతు ధరల అమలుకు చట్టం తెస్తామని చెప్పిన మోదీ దానిని పూర్తిగా పక్కనపెట్టారు." -జీవన్ రెడ్డి
రైతుల పొట్టగొట్టి బేరగాళ్లకు దోచి పెట్టడమే బీజేపీ పని
జాతీయ ఉపాధి హామీ పథకం కింద కల్లాలు కడితే 150 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాలని కేంద్రం కొర్రీ పెట్టిందని జీవన్ రెడ్డి తెలిపారు. చేపలు ఆరబోసుకునేందుకు కొన్ని రాష్ట్రాల్లో కల్లాలకు అనుమతిచ్చిన కేంద్రం వడ్ల కల్లాలకు అనుమతి ఇవ్వదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్రానికి ఎందుకు కక్ష ,కోపం ,వివక్ష అని నీలదీశారు. రైతులు వడ్లు ఆరబోసుకునేందుకు కల్లాలు కడితే ఎలా తప్పు అని ప్రశ్నించారు. రైతుల కల్లాలపై ఎందుకింత కల్లోలం సృష్టిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల పొట్ట గొడుతోందన్నారు. రైతుల పొట్టగొట్టి బేరగాళ్లకు దోచి పెట్టడమే బీజేపీ ప్రభుత్వం పని అని విమర్శించారు. సాగు చట్టాలు తెచ్చి రైతులను కార్లతో తొక్కించి, తుపాకులతో కాల్చి చంపారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచారన్నారు. తెలంగాణకు పది కోట్ల పనిదినాలు కేటాయించారని, ఇప్పటికే పదిన్నర కోట్ల పని దినాలు పూర్తి అయ్యాయన్నారు. బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక దమననీతిని రైతాంగం అర్ధం చేసుకోవాలని జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ రైతుల కోసం పాటుపడుతోందన్నారు.