Minister Vemula Prashanth Reddy : కేసీఆర్ ను కట్టడి చేయాలని కవితపై కేసుల వేధింపులు- మంత్రి వేముల
Minister Vemula Prashanth Reddy : లక్షల కోట్లు దోచుకున్న మోదీ దోస్త్ అదానీపై సమగ్ర విచారణ చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన లబ్దిదారుల తగ్గుదలపై ఎంపీ అర్వింద్ కు సవాల్ విసిరారు.
Minister Vemula Prashanth Reddy : పసుపు బోర్డు పేరుతో రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసి ఎంపీ అయిన అర్వింద్..బాండ్ పేపర్ కున్న వాల్యూ పోగొట్టారని ఎద్దేవా చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రైతుబంధును కాపీ కొట్టి ప్రవేశపెట్టిన ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభంలో నిజామాబాద్ జిల్లాలో ఎంత మందికి వచ్చింది..ఇప్పుడు ఎంత మందికి వస్తుందో ఎంపీ అర్వింద్ సమాధానం చెప్పాలన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో జరిగిన బీఆరెస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన.. రైతు బంధు కింద కేసీఆర్ ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నారని ఏటా లబ్దిదారుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ప్రధాని కిసాన్ యోజన లబ్దిదారుల సంఖ్య తగ్గుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, కవితను తనను ఫేస్ బుక్ వేదికగా తరుచూ తిట్టే అర్వింద్ అదే ఫేస్ బుక్ లో తన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.
మోదీ దోస్త్ అదానీ
ప్రధాని మోదీ పాలన వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు అరిగోస పడుతున్నారని మంత్రి వేముల మండిపడ్డారు. తనకు అనుకూలమైన అదానీ లాంటి కార్పొరేట్ దోస్తులకు 12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేశారనీ, ఆ మాఫీ చేసిన డబ్బులతో బీజేపీ ప్రత్యర్థి రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొంటూ అక్కడి ప్రభుత్వాలను కూలదోస్తున్నరని మండిపడ్డారు. అలాగే తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని కూలదోయాలని కుట్రలు చేస్తే కేసీఆర్ అడ్డు పడ్డారని అన్నారు. గ్యాస్,పెట్రోల్, డీజిల్,ఎరువుల ధరలు రెట్టింపు చేశారని దీంతో సామాన్యులపై అదనపు భారం పడుతుందని మంత్రి వేముల మండిపడ్డారు. పేదలను, రైతులను పీడిస్తూ...తన కార్పొరేట్ మిత్రులకు దేశ సంపదను దోచి పెడుతున్న మోదీని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని, అందుకే కేసీఆర్ ను కట్టడి చేయాలని ఆయన బిడ్డ కవితమ్మను కేసుల పేరుతో వేధిస్తున్నరన్నారు. లక్షల కోట్లు దోచుకున్న మోదీ దోస్త్ అదానీ మీద సమగ్ర విచారణ చేయాలని పార్లమెంట్లో ప్రతి ఎంపీ డిమాండ్ చేస్తున్నారని దానిపై ఎలాంటి స్పందనా లేదన్నారు. ఎల్ఐసీ,ఎస్బీఐలో ప్రజలు దాచుకున్న డబ్బులు మాయం చేసిన అదానీ మీద విచారణ చేయరు కానీ...సంబంధం లేని కేసులో కవితమ్మను విచారణ చేస్తున్నారని బీజేపీపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.
అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి
రాష్ట్రంలో ప్రతి గడపకు కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని ఎవరు మంచి చేస్తున్నారో..ఎవరు మాటలు చెప్తున్నారో విజ్ఞులైన ప్రజలు అన్ని గమనిస్తున్నారని మంత్రి వేముల అన్నారు. రైతులు, పేద ప్రజల పక్షాన నిలబడ్డ కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న బీజేపీపై ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని కోరారు.
ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రతిపక్షాలు పనికట్టుకొని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు ఆ పార్టీ నేతలు