Nirmal News : నిర్మల్ లో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్, ఈ నెల 11 వరకు ప్రదర్శన పోటీలు
Nirmal News : నిర్మల్ లో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ ప్రారంభం అయింది. ఇవాళ్టి నుంచి జనవరి 11 వరకు వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు నిర్వహిస్తారు.
Nirmal News : నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ 2023 అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక సెయింట్ థామస్ స్కూల్ నిర్వహిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శన పోటీలను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఫేర్ ప్రారంభించారు. సైన్స్ ఫేర్ కు సంబంధించిన వివరాలను విద్యార్థులు, గైడ్ టీచర్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 516 మంది విద్యార్థులు, 280 మంది ఇన్స్పైర్ విజేతలతో పాటు గైడ్ టీచర్లు ఈ సైన్స్ ఫేర్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా నాయక్, కలెక్టర్ ముశ్రఫ్ పారూఖీ అలీ, జిల్లా విద్యా శాఖ అధికారి రవిందర్ రెడ్డి పాల్గొన్నారు.
జాతీయ స్థాయికి 50 ఎగ్జిబిట్స్
రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ ను నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అనేక ఆవిష్కరణలు చేయాలన్నారు. రాష్ట్రం నుంచి జాతీయస్థాయికి 50 ఎగ్జిబిట్లను పంపిస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ విద్యార్థులు అంతర్జాతీయ వేదికలైన జపాన్, కంబోడియా దేశాల్లోనూ సత్తాచాటారని గుర్తుచేశారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లిన రాణించాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే కొత్త ఆవిష్కరణలు చేపట్టాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డె సూచించారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులు వస్తున్నాయన్నారు. ఆ మార్పులను అందిపుచ్చుకుని విద్యార్థులు రాణించాలని సూచించారు. విద్యార్థి దశలోనే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ నిర్మల్‌లో నిర్వహించడం ఎంతో సంతోషం అన్నారు. హైదరాబాద్ కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ప్రదర్శనలో పాల్గొంటున్న వారికి అన్ని సదుపాయాలు కల్పించినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో బాసర ట్రిపుల్ ఐటీలో రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు.
అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్
— Indrakaran Reddy (@IKReddyAllola) January 9, 2023
ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆకట్టుకుంటున్న సైన్స్ ఫేర్
ఇవాళ్టి నుంచి 11 వరకు నిర్వహణ pic.twitter.com/fjFlqJIMcU
ఏబీవీపీ నాయకుల ఆందోళన
విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విఫలమయ్యారని ఏబీవీపీ నాయకులు నిరసన తెలిపారు. నిర్మల్ జిల్లాలోని సైన్స్ ఫేర్ కార్యక్రమానికి బయలుదేరిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి కారును ఏబీవీపీ, విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌తో పాటు బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గుచేటు అని విద్యార్థి సంఘాలు ఆరోపించారు.