Basara IIIT Students Protest : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ టెన్షన్, మెస్ లలో బైఠాయించిన విద్యార్థులు
Basara IIIT Students Protest : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. అధికారులు ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదని, మెస్ లపై చర్యలు తీసుకోవాలని ఆరోపించారు. ఈ1, ఈ2 మెస్ లలో బైఠాయించి ఆందోళన చేశారు.
Basara IIIT Students Protest : బాసర IIITలో మళ్లీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శనివారం రాత్రి ఈ1, ఈ2 విద్యార్థులు మెస్ లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాత్రి భోజనం సైతం చేయమని భీష్మించుకున్నారు. తమకు అధికారులు ఇచ్చిన హామీ నెరవేర్చాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
మళ్లీ విద్యార్థుల ఆందోళన
నిర్మల్ జిల్లా బాసర IIIT లో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థులు మరోసారి ఆందోళన చేపట్టారు. ఈ నెల 17న బాసర IIIT లో ఇన్ఛార్జ్ వీసీతో విద్యార్థులు చర్చలు నిర్వహించారు. ఫుడ్ పాయిజన్ కు కారణమైన మెస్ కాంట్రాక్టర్లను తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మరికొన్ని డిమాండ్లను ఇన్ఛార్జ్ వీసీ ముందు వుంచారు. ఈ నెల 24వ తేదీ లోపు వీసీని నియమించాలని విద్యార్థులు డెడ్ లైన్ పెట్టారు. లేనిపక్షంలో 25 నుంచి మళ్లీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అయితే IIIT కి సెలవులు ఇస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మెస్‌లో ఉపయోగించే పదార్థాలన్నీ టెండర్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న ప్రమాణాల ప్రకారం కొనుగోలు చేయబడతాయని హామీ ఇవ్వబడింది.
ఏ ఒక్క హామీ నెరవేరలేదు
అయితే ఇప్పటికీ ఉపయోగిస్తున్న పదార్థాలలో ఎటువంటి మార్పును చూడలేదని, ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమైన ఆహారం పరీక్ష నమూనాలపై ఇచ్చిన నివేదికలో కారణాన్ని బహిరంగంగా ఎందుకు ప్రకటించలేదని విద్యార్థులు ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఆందోళనలు చేసిన అధికారులు, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. తాము ఇచ్చిన 12 డిమాండ్లు పరిష్కారం కాలేదని నిరసనకు మళ్లీ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఫుడ్ పాయిజన్ కు కారణమైన మెస్ లపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని మండిపడుతున్నారు.
ఇన్యూరెన్స్ వివాదం
మరోపక్క బాసర IIITలో విద్యార్థుల ఇన్సూరెన్స్ వివాదం దుమారం రేపుతోంది. ఇటీవల బాసర IIITలో రెండో సంవత్సరం చదువుతున్న వరంగల్ విద్యార్థి సంజయ్ కిరణ్ మరణించగా, అతనికి ఇన్సూరెన్స్ లేదని తేలింది. కాలేజీలో మాత్రం ఇన్సూరెన్స్ చేయిస్తామని చెప్పి విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారని, తీరా ఒక విద్యార్థి చనిపోతే కానీ తేలవలేదు ఇన్సూరెన్స్ చేయలేదన్న విషయం అంటూ విద్యార్థులు. ఈ విషయంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు మాత్రం తాము 700 రూపాయలు ఇన్సూరెన్స్ కోసం చెల్లించామంటూ వాపోతున్నారు. ఇలా చూస్తే ప్రతి సంవత్సరం విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని ఇన్సూరెన్స్ చేయకుండా లక్షల్లో నగదు దోచేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.