Basara IIIT Students Protest : ఏడో రోజుకు చేరిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నిరసన, లిఖిత పూర్వక హామీకి స్టూడెంట్స్ డిమాండ్
Basara IIIT Students Protest : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేస్తున్న నిరసనలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్నాయి.
Basara IIIT Students Protest : గత ఏడు రోజులుగా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. ఎలాంటి ఆందోళనలకు తావివ్వకుండా క్యాంపస్ ప్రధాన గేటు వద్ద విద్యార్థులు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరేళ్లుగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఉన్న సమస్యలు పరిష్కరించలేదని స్టూడెంట్స్ అంటున్నారు. చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేదని వాపోయారు. చివరికి క్యాంపస్ లో ఉన్న దాదాపు 9 వేల మంది విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. గత రాత్రి కలెక్టర్ విద్యార్థులతో చర్చించారు. అయితే ఈ చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. అయితే విద్యార్థులు లిఖిత పూర్వక హామీ కావాలని కోరడంతో కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
దారుణ పరిస్థితులు !
యూనివర్సిటీలో మరుగుదొడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. కనీస మరమ్మతులకు నోచుకోలేని దుస్థితి. బాత్రూంలు వాటర్ పైపులు పగిలిపోయాయి. విద్యార్థినులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. లైటింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. స్విచ్ బోర్డులు పనిచేయటంలేదు. చాలా దారుణమైన పరిస్థితులు ట్రిపుల్ ఐటీలో ఉన్నాయి. పోలీసుల ఆంక్షలతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో కనీసం మీడియాకు కూడా అనుమతి లేదు. ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ ప్రారంభమైనప్పటి నుంచి వైస్ ఛాన్సలర్ ను నియమించలేదు. అప్పటి నుంచి అంతా ఇంఛార్జీల పాలనలోనే నడుస్తోంది. యూనివర్సిటీలో ఉన్న సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారు. యూనివర్సిటిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. - ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
విద్యార్థుల డిమాండ్స్
విద్యార్థులు రెగ్యులర్ వీసీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలంటున్నారు. ICT ఆధారిత విద్య అందించాలని కోరుతున్నారు. పీయూసీ బ్లాక్ లు హాస్టళ్ల పునరుద్ధరణ, లైబ్రరీలో బుక్స్ అందుబాటులో ఉంచాలని ఇలా వారికి యూనివర్సిటీలో అవసరమైన వాటినే అడుగుతున్నారు. కనీసం యూనిఫామ్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో యూనివర్సిటీ ఉందంటే విద్యార్థుల ఆవేదనకు అర్థం లేకపోలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇన్నాళ్లు ఓపిక పట్టిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఓపిక నశించి ఇలా ఏడు రోజులైనా వెనక్కి తగ్గకుండా ఎంత కష్టమైన తమ నిరసనను కొనసాగిస్తున్నారన్నారు. అందుకే సీఎం కేసీఆర్ వచ్చి చూస్తే తమ సమస్యలు అర్థమవుతాయి అనే ఉద్దేశ్యంతో గత ఏడు రోజులుగా ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్దే బైఠాయించి నిరసనలు తెలువుతున్నారు స్టూడెంట్స్. ఇకనైనా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు విద్యార్థులు, వారి తల్లి దండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు.