New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు
New Contraceptive Tool: ఇప్పుడే పిల్లలు వద్దనుకునే దంపతులకు నూతన గర్భనిరోధక సాధనాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దీని అమలుకు ఏర్పాట్లు చేస్తోంది.
New Contraceptive Tool: గర్భనిరోధక పద్ధతుల్లో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. ప్రస్తుతం ఇప్పుడే పిల్లలు వద్దనుకునే వాళ్లు మాత్రలు, కండోమ్స్, ఇంజెక్షన్లు, కాపర్-టి వంటి వాటిని వాడుతున్నారు. అయితే వీటికి అదనంగా మోచేతి చర్మం కింద పైపొరలో తేలికపాటి సూది మాదిరిగా ఉన్న సన్నటి సాధనాన్ని అమర్చి గర్భం రాకుండా నిరోధించే పద్దతిని అందుబాటులోకి తేబోతున్నారు. 3 నుంచి 4 సెంటిమీటర్ల పొడవు, 2 నుంచి 4 మిల్లీ మీటర్ల మందంతో ఉండే ఈ సాధనం నుంచి గర్భాన్ని నిరోధించే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అసలీ సాధనమే హార్మోన్ తో తయారు అవుతుంది. ఇది మహిళ అండాశయం నుంచి అండం ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది. దీని వల్ల బిడ్డల మధ్యం దూరం కావాలని కోరుకునే భార్యాభర్తలకు కలయిక సమయంలో ఎలాంటి అసౌకర్యం, సంకోచం ఉండదు. ఈ విధానాన్ని సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ గా పేర్కొంటున్నారు. పాత విధానాల్లో ఉన్న ఇబ్బందులన్నింటిని ఈ కొత్త విధానంతో అధిగమించవచ్చు.
మాత్రలు వేస్కోవడం వల్ల సైడ్ ఎఫెక్స్ట్ వస్తాయని చాలా మంది భావిస్తారు. అందుకే ఎక్కువగా కండోమ్స్ వాడుతుంటారు. కానీ వీటి వల్ల గర్భం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కాపర్-టి వల్ల కూడా నొప్పి ఉంటుందని వాటికి దూరంగా ఉంటారు. ఇలాంటి వాటికంటే మరింత బాగుండి.. ఎలాంటి సైడ్ ఎఫెక్స్ట్స లేకుండా చేసే ఈ నూతన సాధనం గురించి మరింత తెలుసుకోండి.
పాలిచ్చే తల్లులకు కూడా ఈ సాధనం అమర్చొచ్చు..
కొన్ని దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా తమిళనాడు, కర్ణాటక, అస్సాం, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బిహార్, దిల్లా రాష్ట్రాల్లో అమల్లోకి తేవడంపై సమాలోచనలు చేస్తోంది. ఈ సాధనాన్ని స్టాఫ్ నర్సులు సైతం అమర్చేలా వారికి శిక్షణను ఇస్తారు. ఈ విధానంలో మూడేళ్ల వరకు గర్భం రాకుండా భద్రత లభిస్తుంది. ప్రసవం జరిగిన వెంటనే లేదా పాలిచ్చే తల్లులకూ ఈ సాధనాన్ని అమర్చొచ్చు. కాపర్-టి విషయంలో మహిళలకు కనిపించే భయాలు ఈ విధానంలో ఉండవు. ఈ సాధనాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు సులువుగా తీసి వేసే వీలు ఉంది. దీన్ని తొలగించిన 48 గంటల తర్వాత గర్భం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంజెక్షన్ ను సిరంజితో ఇచ్చినట్లే.
దుష్ప్రభావాలు ఏవీ ఉండవని వెల్లడి..
ఈ సాధనాన్ని చేతికి అమర్చేందుకు ప్రత్యేక సాధనం ఉంటుంది. కుడిచేతి వాటం వారికి ఎడమ చేతికి, ఎడమ చేతి వాటం ఉన్నవారికి కుడి చేతికి చర్మం కింద దీన్ని అమరుస్తారు. కెన్యాలో 20 నుంచి 25 ఏళ్లుగా ఈ విధానం ఉంది. కొద్దికాలం కిందట కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బృందం కెన్యాలో అధ్యయనం చేసి వచ్చింది. ఈ సాధనంతో దుష్ర్పభావాలు ఏవీ ఉండవని కేంద్రం పేర్కొంది. పెద్ద రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి గర్భనిరోధ పద్ధతులను అవలంభించేవారు ఏటా 5 లక్షల పైనే ఉంటున్నారని తెలిపింది.