Nagarjuna statement: నాగచైతన్య, సమంత విడాకులపై వ్యాఖ్యలు అనుచితం- కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలన్న నాగార్జున
Actor Nagarjuna statement in Defamation case | మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై దారుణవ్యాఖ్యలు చేశారని, నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమని అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కోర్టుకు నాగార్జున తెలిపారు.
Nampally Court records Actor Nagarjuna statement in Defamation case against Konda Surekha | హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువునష్టం దావాపై టాలీవుడ్ నటుడు నాగార్జున, ఆయన భార్య, నటి అమల, నటుడు నాగచైతన్య నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, సినిమా రంగం ద్వారా దేశ వ్యాప్తంగా తమ కుటుంబానికి ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయని నాగార్జున చెప్పారు. తమ కుటుంబసభ్యులు నటించిన సినిమాలకు సైతం జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని, సినిమా రంగంతో పాటు పలు సామజిక సేవా కార్యక్రమాలు సైతం తన ఫ్యామిలీ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. నటుడు నాగార్జునతో పాటు సుప్రియ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు కేసు తదుపరి విచారణ అక్టోబర్ 10కి వాయిదా వేసింది. ఆరోజు మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డు చేయనుంది.
మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరిన నాగార్జున
తన కొడుకు నాగ చైతన్య, సమంతల విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ కారణంగా జరిగాయని మంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. అందులో నా ప్రమేయం సైతం ఉన్నట్లు మహిళా మంత్రి బహిరంగంగా అలా మాట్లాడం వల్ల మా కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని నాగార్జున స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డు చేసింది. తమ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును నాగార్జున కోరారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి, ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తమను ఎంతగానో బాధించాయని నాగార్జున అన్నారు.
పిటిషన్ ఫైల్ చేయడానికి కారణం, ఉద్దేశం ఏంటని నాగార్జునను కోర్టు ప్రశ్నించింది. మంత్రి కొండా సురేఖ తమ రాజకీయ ప్రయోజనాల కోసం తన ఫ్యామిలీపై అమర్యాద పూర్వక వాఖ్యలు చేశారని.. దాంతో తమ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని నాగార్జున స్టేట్ మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా తన కొడుకు నాగచైతన్య, సమంత విడాకులుపై మంత్రి కొండా సురేఖ అనుచిత వాఖ్యలు చేశారని.. ఆమె చర్యలకు ఆదేశించాలని కోర్టును నాగార్జున కోరారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, అందుకే పరువు నష్టం దావా వేసినట్లు నాగార్జున తెలిపారు.
కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరైన నాగార్జున ఫ్యామిలీ
నాగార్జున వేసిన పరువునష్టం పిటిషన్ పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి ఆయన తరఫున వాదనలు వినిపించారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ నటుడు నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ముఖ్యంగా నటీనటులు నాగ చైతన్య, సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలు వారి కుటుంబం పరువు ప్రతిష్టలు దిబ్బతినేలా ఉన్నాయని వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు పిటిషనర్ నాగార్జున స్టేట్ మెంట్ రికార్డు చేయాలని.. ఆయనను కోర్టుకు హాజరు కావాలని, సాక్షులు సైతం రావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో నాగార్జున, అమల, నాగచైతన్య నాంపల్లి కోర్టుకు మంగళవారం మధ్యాహ్నం హాజరయ్యారు. వీరితో పాటు నాగార్జున ఓ సోదరి, ఆయన మేనకోడలు సుప్రియ ఇతర సాక్షులు కోర్టుకు హాజరయ్యారు. నాగార్జున స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్న కోర్టు మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకుంటారా, లేక మందలించి వదిలేస్తారా అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.