Khammam Crime: డబుల్ బెడ్ రూమ్ పేరుతో కోటి రూపాయలు వసూలు- తెలిసిందెవరో తెలిస్తే షాక్
నిరుపేదల అవసరాలను ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు అందినకాడికి దండుకొని ఉడాయిస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఆశ చూపి వసూళ్లకు పాల్పడ్డ ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
నిరుపేదల అవసరాలే వాళ్లకు పెట్టుబడి. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఆశ చూపి వసూళ్లకు పాల్పడిందో ముఠా. ఇల్లే కాదు బ్యాంక్ రుణం కూడా ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసింది. వాళ్ల మాటలు విని మోసపోయిన బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు.
ఖమ్మం పుట్టకోటకు చెందిన లక్ష్మీ, ఖిల్లా ప్రాంతానికి చెందిన షకీనాబేగం నగరంలోని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.30 వేలు వసూళ్లు చేశారు. నగరం నడిబొడ్డున టేకులపల్లిలో నిర్మించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఇల్లు ఇప్పిస్తామని దీంతోపాటు బ్యాంకు రుణం కూడా ఇప్పిస్తామని చెప్పి బాదితులకు మాయమాటలు చెప్పారు. వీరి మాటలు నమ్మిన పేదలు వీరిని నమ్మి డబ్బులు ఇచ్చారు. రూ.30 వేలు కడితే లక్షల విలువ చేసే డబుల్ బెడ్‌రూమ్‌తోపాటు బ్యాంకు రుణం కూడా వస్తుందని బావించిన బాధితులు వీరికి డబ్బులు చెల్లించారు.
పేదలు, మధ్యతరగతి కుటుంబాలనే టార్గెట్‌గా చేసుకున్న ఈ ఇద్దరు మహిళలు, నగరంలోని ఖానాపురం, పాండురంగాపురం ప్రాంతంలో వందల మంది నుంచి డబ్బులు వసూళ్లు చేశారు. ఖానాపురం ప్రాంతంలో రూ.70 లక్షలు, పాండురంగాపురం ప్రాంతంలో రూ.30 లక్షల వరకు వసూళ్లు చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇద్దరు మహిళలు మోహం చాటేయడంతో అనుమానం వచ్చిన బాదితులు ఇల్లు, బ్యాంకు రుణం వద్దని, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచారు. కొన్ని రోజుల పాటు వారిని మభ్యపెడుతూ వచ్చిన మహిళలు గట్టిగా అడిగిన కొంత మందికి ప్రాంసరీ నోట్లు రాసిచ్చారు.
రూ.20 లక్షలకు ఈ ఇద్దరు మహిళలు ప్రాంసరీ నోట్లు రాసిచ్చారు. అయినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఇటీవల తమ ప్రాంతానికి వచ్చిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ నిర్వహించాలని మంత్రి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన అర్బన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. పేదలను టార్గెట్ చేస్తూ ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఇద్దరు మహిళలు కోటికిపైగా వసూళ్లు చేయడం ఖమ్మం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి విషయాలలో నిరుపేదలు మోసపోకుండా ప్రభుత్వ పథకాలు ఎలా వర్తిస్తాయనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూసే అవకాశం ఉంటుంది.