Sathupally Railway Line: కొత్తగూడెం - సత్తుపల్లి మార్గంలో రైలు ప్రారంభం, రికార్డు సమయంలో నిర్మించిన 54 కిలోమీటర్ల రైల్వే లైన్
New Railway line to Sathupally: ఎన్నో ఏళ్లుగా రైలు కూత కోసం ఎదురుచూసిన సత్తుపల్లి వాసులకు ఎట్టకేలకు రైలు కూత వినిపించింది. రెండున్నరేళ్లలోనే 51.10 కిలోమీటర్ల మేర రైల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
New Railway line From Kothagudem to Sathupally: ఎన్నో ఏళ్లుగా రైలు కూత కోసం ఎదురుచూసిన సత్తుపల్లి వాసులకు ఎట్టకేలకు రైలు కూత వినిపించింది. కేవలం రెండున్నరేళ్లలోనే 51.10 కిలోమీటర్ల మేర రైల్ నిర్మాణాన్ని అధికారులు పూర్తి చేశారు. సింగరేణి సంస్థ సత్తుపల్లి నుంచి బొగ్గు రవాణా కోసం ప్రత్యేకంగా ఈ రైల్వే నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గం నుంచి బొగ్గు రవాణా చేయవద్దని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు చేయడంతో ఈ రైలు మార్గాన్ని నిర్మించారు.
వేగవంతంగా నిర్మాణమైన రైల్వే లైన్..
సింగరేణి సంస్థ సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీపీ, కిష్టారం ఓసీపీ నుంచి ఉత్పత్తి చేసే బొగ్గును రవాణా చేసేందుకు ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ రెండు ఓసీపీల ద్వారా 10 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వకాలను చేసేందుకు లక్ష్యంగా చేసుకున్న సింగరేణి సంస్థ దీనిని ఉత్పత్తి చేసిన బొగ్గును తరిలించేందుకు ఈ రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 30 వేల టన్నుల బొగ్గును ఈ మార్గం ద్వారా రవాణా చేసేందుకు అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మొత్తం రూ.927.94 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రైలు మార్గానికి సింగరేణి సంస్థ రూ. రూ.618.55 కోట్లు కేటాయించగా, దక్షిణ మధ్య రైల్వే రూ.309.39 కోట్లు భరించింది. రెండున్నరేళ్ల కాలంలో కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 51.10 కిలోమీటర్ల మేర ఈ రైల్వే నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ రైల్వే లైన్ వెళ్లే మార్గంలో కొత్తగూడెం – ఖమ్మం రహదారి, జగదల్‌పూర్ – విజయవాడ జాతీయ రహదారిపై చేస్తున్న ఆర్‌వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి)లు ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. అయితే రైలు మార్గం పూర్తి కావడంతో అధికారులు ట్రయల్ రన్‌ను పూర్తి చేశారు.
బొగ్గు రవాణాకు మాత్రమే..
కొత్తగూడెం నుంచి కొవ్వూరుకు రైల్వే లైన్‌ను నిర్మించాలని దశాబ్ధాల కాలంగా పోరాటం సాగుతుంది. అయితే కేంద్రం ఈ రైల్ మార్గం నిర్మాణానికి ఆమోదం తెలిపినప్పటికీ నిధులు మాత్రం కేటాయించకపోవడంతో ఇప్పటి వరకు అది పూర్తి కాలేదు. అయితే సింగరేణి బొగ్గు రవాణా కోసం ఏర్పాటు చేస్తున్న ఈ రైల్వే లైన్ వల్ల తమ గ్రామాలకు రైలు మార్గం అందుబాటులోకి వస్తుందని సత్తుపల్లి ప్రాంత వాసులు ఆశపడ్డారు. అయితే ఇది కేవలం బొగ్గు రవాణా కోసం మాత్రమే ఏర్పాటు చేయడం గమనార్హం. మరో రెండు కిలోమీటర్ల దూరం రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేస్తే సత్తుపల్లి వాసులకు సైతం ప్రయాణానికి రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. కనీసం బొగ్గు రవాణా కోసం రైలు మార్గం నిర్మాణం కావడంతో భవిష్యత్‌లో తమకు రైలు మార్గం అందుబాటులోకి వస్తుందని సత్తుపల్లి ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్