ఫ్లోరైడ్ బాధితుడి ఇంట కేటీఆర్ భోజనం- టీఆర్ఎస్ గెలిస్తే మునుగోడు దత్తత తీసుకుంటానని ప్రకటన
Munugode By Election: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తే.. మునుగోడు నియోజక వర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
Munugode By Election: మునుగోడు ఉపఎన్నిక.. కాంట్రాక్టర్ అహంకారానికి మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే.. మనుగోడు నియోజక వర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నియోజక వర్గానికి వచ్చి అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. రోడ్లను బాగు చేయిస్తానన్నారు. తన మాట మీద విశ్వాసం ఉంచి.. టీఆర్‌ఎస్‌ను గెలిపించమని కోరారు.
రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నాం..
సీఎం కేసీఆర్‌కు మునుగోడు కష్టం తెలుసని మంత్రి కేటీఆర్ అన్నారు. 2006లో 32 మండలాలు తిరుగుతూ.. స్వయంగా ఆయనే చూడు చూడు నల్లగొండ.. గుండె నిండా ఫ్లోరైడ బండ అనే పాట రాశారని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు నల్గొండ పరిస్థితి ఎలా ఉండేదో.. ఇప్పుడెలా ఉందో ఆలోచించాలన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే 24 గంటల కరెంటుతోపాటు, ఇంటింటికీ తాగునీరు అందించారని అన్నారు. నల్గొండ జిల్లాలో చెర్లగూడెం, శివన్నగూడెం రిజర్వాయర్ కట్టి రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా.. వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఏనాడు నియోజకవర్గం గురించి పట్టించుకోలే..
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏనాడు నియోజక వర్గం గురించి పట్టించుకోలేదని దుయ్యబట్టారు కేటీఆర్. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మార్చే వాళ్లకంటే ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నేతలను గుర్తించి ఓటు వేస్తేనే.. అందరికీ మంచి జరుగుతుందన్నారు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్లకు ఓటు వేసి గెలిపించినా ఎలాంటి ఫలితం ఉండదని తెలిపారు. ప్రచారం అనంతరం మునుగోడు నియోజకవర్గం శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని గతంలో ఆయనకు మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. డబుల్ బెడ్ రూం ఇల్లుతోపాటు ప్రభుత్వం తరఫున ఐదున్నర లక్షల రూపాయలు మంజూరు చేయించారు. మిగిలిన ఇంటి నిర్మాణానికి సంబంధించి తన కార్యాలయం ద్వారా పర్యవేక్షణ చేయించి పూర్తి చేయించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి విద్యాసాగర్ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులను పర్యవేక్షించారు.
అంశాల స్వామి ఇంట్లో భోజనం చేసిన మంత్రి
మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పూర్తయిన తర్వాత నూతనంగా నిర్మించిన అంశాల స్వామి ఇంటికి మంత్రి కేటీఆర్ అకస్మాత్తుగా వచ్చారు. అంశాల స్వామితోపాటు ఆయన తల్లిదండ్రుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి, అంశాల స్వామి కుటుంబ సభ్యులతో కలిసి వారి ఇంట్లోనే భోజనం చేశారు. స్వయంగా మంత్రే స్వామికి భోజనం వడ్డించారు. ఇంటి నిర్మాణం, ఆయన హెయిర్ కటింగ్ సెలూన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులోనూ అంశాల స్వామి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.