Suryapet Honour Killing: నానమ్మ కళ్లల్లో ఆనందం చూసేందుకు దారుణం, సూర్యాపేటలో పరువుహత్య కేసులో సంచలన విషయాలు
సూర్యాపేట జిల్లాలో జరిగిన పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కుల పిచ్చితో నిందితుల నానమ్మ రెచ్చగొట్టడమే ఒక యువకుడి హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది.
![Suryapet Honour Killing: నానమ్మ కళ్లల్లో ఆనందం చూసేందుకు దారుణం, సూర్యాపేటలో పరువుహత్య కేసులో సంచలన విషయాలు Honour Killing in Suryapet due to Inter caste marriage and grandmother encourage Suryapet Honour Killing: నానమ్మ కళ్లల్లో ఆనందం చూసేందుకు దారుణం, సూర్యాపేటలో పరువుహత్య కేసులో సంచలన విషయాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/cbf7b652aa1785d4f29fde7005a2497e1738207212492233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Honour Killing In Suryapet District | సూర్యాపేట జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపిన పరువు హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక ఎర్టీగా కారు, కత్తి, 5 సెల్ ఫోన్లు, ఒక ప్లాస్టిక్ సంచి, తాడు పిల్లలమర్రికి చెందిన భార్గవి, మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ (Vadlakonda Krishna) అలియాస్ మాల బంటి పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. దాంతో కృష్ణపై పగ పెంచుకుని ప్లాన్ ప్రకారం అతడ్ని అమ్మాయి బంధువులు హత్య చేశారని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ పరువు హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి.
సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల బుచ్చమ్మనే ఈ పరువు హత్య జరగడానికి కారణమని సమాచారం. నానమ్మ బుచ్చమ్మ కళ్లల్లో ఆనందం చూసేందుకు, మరోవైపు గ్రామంలో తమను తలదించుకునేలా చేసిన కృష్ణను హత్య చేయాలని నవీన్ ఇదంతా ప్లాన్ చేశాడు. నానమ్మ బుచ్చమ్మకు కుల పిచ్చి ఉందని, ఆమెనే తన సోదరులను రెచ్చగొట్టి తన భర్త కృష్ణను హత్య చేయించిందని భార్గవి ఆరోపించారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు కృష్ణను చంపేయాలని తన కొడుకు, మనవడ్ని నానమ్మ రెచ్చగొట్టడమే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. నాన్నమ్మ కళ్లల్లో ఆనందం చూసేందుకు కృష్ణను తన అన్న నవీన్ హత్య చేశాడని చెప్పారు. హత్యకు కారణమైన సోదరుడు నవీన్, నానమ్మ బుచ్చమ్మకు ఉరిశిక్ష వేయాలని బాధితురాలు భార్గవి డిమాండ్ చేశారు.
కేసులో అరెస్టైన నిందితుల వివరాలివే..
A1) కోట్ల నవీన్ (24) తండ్రి సైదులు, వృత్తి: వ్యవసాయము, నివాసము- సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామం
A2) బైరు మహేశ్ (39) తండ్రి శ్రీను, వృత్తి: వ్యవసాయం నివాసం- సూర్యపేట టౌన్ తాళ్ళగడ్డ
A3) కోట్ల సైదులు (43) తండ్రి బిక్షమ్, వృత్తి: వ్యవసాయము, నివాసము- సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామం
A4) కోట్ల వంశీ(22) తండ్రి సైదుల, వృత్తి: విద్యార్థి, నివాసం- సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామం
A5) కోట్ల బుచ్చమ్మ(65) భర్త లేట్ బిక్షమ్, వృత్తి: గృహిణి, సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామం
A6) నువ్వుల సాయిచరణ్(23) వృత్తి: ప్రయివేట్ జాబ్, నివాసము: నల్లగొండ టౌన్ DVK రోడ్‌లో ఇళ్లు
అసలేం జరిగిందంటే..
హత్యకు గురైన కృష్ణ, పిల్లలమర్రికి చెందిన కోట్ల నవీన్ కు పరిచయం ఉంది. కృష్ణ తరచూ నవీన్ ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమములో నవీన్ సోదరి భార్గవితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం తెలిసి భార్గవిని పెద్దలు మందలించారు. కృష్ణ, భార్గవి గత ఏడాది ఆగస్టు 7న పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహంపై నానమ్మ బుచ్చమ్మ మండిపడింది. ఎలాగైన కృష్ణను హత్యచేయాలంటూ కుటుంబసభ్యులను రెచ్చగొట్టింది. నానమ్మ సంతోషం కోసం, కుటుంబం పరువు తీసిన కృష్ణను చంపడమే కరెక్ట్ అని నవీన్ భావించాడు.
సోదరుడు, స్నేహితులతో కలిసి ప్లాన్..
నవీన్, తన సోదరుడు వంశీ అతడి స్నేహితుడు బైరు మహేష్ తో కలిసి కృష్ణ హత్యకు ప్లాన్ చేశాడు. బైరు మహేష్‌తో కృష్ణకు పరిచయం ఉండటంతో కృష్ణకు ఫోన్ చేసి రప్పించాడు. గత ఆరు నెలల్లో మాల బంటి (కృష్ణ)ని హత్య చేయాలని ప్లాన్ చేసి 3 సార్లు ఫెయిలయ్యారు. ఈసారి అలా కాకూడదని జనవరి 26న మహేష్‌తో ఫోన్ చేయించి కృష్ణను రప్పించారు. మహేష్ మద్యం సేవించగా, కృష్ణ కూల్ డ్రింక్ తాగాడు. పార్టీ అయిపోయే సమయంలో నవీన్, వంశీలకు ఫోన్ చేసి అలర్ట్ గా ఉండాలని మహేష్ చెప్పాడు. పార్టీ అయిపోయాక మద్యం సేవించని కృష్ణ స్కూటీ స్టార్ట్ చేయగా వెనుక కూర్చున్న మహేష్ ప్లాన్ అమలు చేశాడు. కృష్ణ గొంతు గట్టిగా పట్టుకుని నవీన్ కు ఫోన్ చేశాడు. సిద్ధంగా ఉన్న నవీన్, వంశీ అక్కడికి చేరుకుని కృష్ణపై దాడి చేశారు. కృష్ణ కాళ్లు వంశీ గట్టిగా పట్టుకోగా, నవీన్, మహేష్ లు గొంతు నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. డెడ్ బాడీని ఎర్టీగ కారులో తీసుకెళ్లి నానమ్మ బుచ్చమ్మకు చూపించగా, ఆమె సంతోషంగా ఉందని చెప్పింది. చివరగా డెడ్ బాడీని పిల్లలమర్రి శివారులో చెర్వు కట్ట చివరలో మూసి కెనాల్ పక్కన పడేశారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుల్ని అరెస్ట్ చేశారు. కులాంతర వివాహం చేసుకున్న కారణంగానే కృష్ణను పరువు హత్య చేశారని తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)