Nalgonda News: మరో అవినీతి తిమింగలం - ఏసీబీకి చిక్కిన నల్గొండ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్
Telangana News: మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. వ్యాపారి నుంచి రూ.3 లక్షల లంచం తీసుకుంటుండగా నల్గొండ జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ACB Caught Nalgonda Government Hospital Superintendent: మరో అవినీతి తిమింగలం ఏసీబీ (ACB) వలకు చిక్కింది. నల్గొండ (Nalgonda) జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఔషధాల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి సూపరింటెండెంట్ లచ్చునాయక్ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో పక్కా ప్లాన్ తో వెంకన్న నుంచి లచ్చునాయక్ ఆయన నివాసంలో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రికి గత రెండేళ్లుగా ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు వ్యాపారి వెంకన్న తెలిపారు. కొన్నాళ్లుగా సూపరింటెండెంట్ 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారని.. ఇటీవల అధిక శాతం కావాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. నెల రోజుల క్రితం రూ.లక్ష ఇవ్వగా.. 4 రోజుల క్రితం మరో రూ.3 లక్షలు డిమాండే చేశారని చెప్పారు. అడిగిన డబ్బులు ఇవ్వకుంటే టెండర్లు పిలిచి బయటి వారికి ఇస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు. డబ్బులు కట్టలేక ఏసీబీ డీఎస్పీని సంప్రదించగా.. వారి సూచన మేరకు శుక్రవారం ఉదయం సూపరింటెండెంట్ కు డబ్బులు ఇచ్చానని చెప్పారు. అదే సమయంలో ఆయన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారని వెంకన్న వివరించారు.
మేడ్చల్ లో ఇటీవలే..
కాగా, 3 రోజుల క్రితం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట తహసీల్దార్ ఏసీబీ అధికారులకు చిక్కారు. పట్టాదార్ పాస్ బుక్ జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేయగా.. బాధితుని ఫిర్యాదుతో పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు ఆ అధికారి పని పట్టారు. శామీర్ పేట తహసీల్దార్ సత్యనారాయణ రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన రామశేషగిరిరావుకు షామీర్ పేట మండలంలోని లాల్ గడి మలక్పేట్ గ్రామంలో 29 ఎకరాల భూమి ఉంది. తన భూమికి పట్టాదారు పాస్ పుస్తకం కోసం ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పాస్ పుస్తకం జారీ చేసేందుకు ఎమ్మార్వో లంచం డిమాండ్ చేశారు. దీంతో రామశేషగిరి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు బాధితుడు.. ఎమ్మార్వో సత్యనారాయణకు డబ్బు సిద్ధం అయ్యాయని సమాచారం ఇచ్చాడు. మంగళవారం ఎమ్మార్వో డ్రైవర్ బద్రి రూ.10 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎమ్మార్వో తీసుకోమంటేనే తాను డబ్బు తీసుకున్నట్లు డ్రైవర్ అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తహసీల్దార్ ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తహసీల్దార్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది.
Also Read: HCA: హైదరాబాద్ ఉమెన్ క్రికెట్ హెడ్‌కోచ్ జైసింహపై వేటు- సమగ్రవిచారణకు ఆదేశం