Munugode By-Elections: ఫ్రీ గుర్తులపై హైకోర్టుకు వెళ్లిన టీఆర్ఎస్- రేపు విచారణ చేస్తామన్న ధర్మాసనం!
Munugode By-Elections: మునుగోడు ఉపఎన్నికలపై తెరాస హైకోర్టులో పిటిషన్ వేసింది. స్పందించిన ధర్మాసనం రేపు విచారణ చేపడతామని తెలిపింది.
Munugode By-Elections: మునుగోడు ఉపఎన్నికల్లో గుర్తులపై టీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్లింది. కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను తొలగించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. స్పందించిన ధర్మాసనం రేపు(మంగళవారం) విచారణ చేపడతామని తెలిపింది.
అసలేం జరిగిందంటే..?
మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 గుర్తులను ఎవరికి కేటాయించవద్దని గులాబీ పార్టీ కోరుతోంది. ఫ్రీ సింబల్స్ నుంచి కారును పోలిన ఎనిమిది గుర్తులను తొలగించాలని ఇప్పటికే ఈసీకి టీఆర్ఎస్ లేఖ ఇచ్చింది. మునగోడు ఉపఎన్నిక గుర్తుల జాబితా నుంచి ఓడ, డోలీ, కెమెరా, రోడ్ రోలర్, టీవీ, కుట్టు మిషన్, చపాతీ రోలర్, సబ్బు డబ్బా గుర్తులను తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 10 వ తేదీన ఎన్నికల కమిషన్ ను టీఆర్ఎస్ కోరింది. అయితే టీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తికి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో టీఆర్ఎస్ అధిష్ఠానం ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించింది.
గతంలో 2018వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని టీఆర్ఎస్ చెబుతోంది. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కంటే కూడా స్వంతత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయని అంట్లోంది. కారును పోలి ఉన్నందు వల్లే వాళ్లు గెలవగలిగారని ఈసీకి వివరిస్తోంది. మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్‌లో 2018 ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్సీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువా, నాగార్జున సాగర్‌లలో కెమెరా గుర్తుకు కూడా బీఎస్సీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. ఈ క్రమంలోనే ఈ ఎనిమిది గుర్తులను తొలగించాలని కోరారు.
ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన అధికారులు
ఎన్నికల కోడ్ ఉండగానే సీఎం కేసీఆర్‌పై అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ లీడర్లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారికి టీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. బుద్ధ భవన్‌లో సీఈఓ వికాస్ రాజ్‌ని కలిసిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి జనరల్ సోమ భరత్ కుమార్ వినతి పత్రం అందజేశారు. అదే టైంలో టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులను ఫ్రీ జాబితా నుంచి తొలగించాలని అభ్యర్థించారు.