Tribals Attacked Forest Officials : అటవీ అధికారులను పరుగులుపెట్టించిన గుత్తికోయలు, గొడ్డళ్లతో దాడికి యత్నం!
Tribals Attacked Forest Officials : అటవీ అధికారులపై గుత్తికోయలు దాడికి పాల్పడ్డారు. పోడు వ్యవసాయం భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన అధికారులను గుత్తికోయలు గొడ్డళ్లలతో దాడికి యత్నించారు.
Tribals Attacked Forest Officials :అటవీశాఖ అధికారులపై మరోసారి గుత్తి కోయలు దాడిచేశారు. ములుగు, మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఘటన చోటుచేసుకుంది. ట్రెంచ్ పనులు చేసేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను గుత్తికోయలు కత్తులు, గొడ్డల్లతో తరిమిన సంఘటన తాడ్వాయి, కొత్తగూడ మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగింది. కొత్తగూడ అటవీ రేంజ్ రాంపూర్ నార్త్ బీట్ తాడ్వాయి మండలం జగ్గన్నగూడెం సమీపం వరకు విస్తరించి ఉన్నది. ఇక్కడ బూడిదగడ్డ ప్రాంతంలో కొందరు గుత్తికోయలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కొత్తగూడ ఎస్ఆర్వో ఓటాయి సెక్షన్ పరిధిలోని అధికారులను ప్రొక్లెయిన్ మిషన్ ను పంపారు. ఆ ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు. దట్టమైన అడవిని దాటి అధికారులు వెళ్లారు. అధికారులు పనులు ప్రారంభించేది గమనించిన గుత్తి కోయలు కత్తులు, గొడ్డళ్లు, కొడవలతో అధికారులపైకి తిరగబడి దాడికి యత్నించారు. దీంతో అధికారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులుపెట్టారు. మిషన్ ను ఇక్కడ అటవీ ప్రాంతంలో ఉన్న వాచ్ టవర్ వద్ద దాచిన అధికారులు రేంజ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎలాంటి రక్షణ లేకుండా పంపిన ఎస్ఆర్వో పై కింది స్థాయి సిబ్బంది ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుత్తి కోయలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్ఆర్వో శ్రీనివాసరావును గొంతు కోసి చంపిన సంఘటన మరువకముందే ఈ సంఘటన జరగడంతో అటవీశాఖ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం తమకు ఆయుధాలు ఇవ్వాలని కోరుతున్నారు.
ఫారెస్ట్ అధికారిపై దాడి, హత్య
గత ఏడాది నవంబర్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీశాఖ అధికారిపై గుత్తికోయలు కత్తులతో దాడి చేశారు. చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామం ఎర్రబోడులో ప్లాంటేషన్ మొక్కలను పోడుభూమి సాగుదారులు నరుకుతుండటంతో వాటిని అడ్డుకునేందుకు ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అయితే మొక్కలను నరకవద్దని గుత్తికోయలను హెచ్చరించడంతో గుత్తికోయలు ఆగ్రహంతో ఆయనపై దాడి చేశారు. ఒక్కసారిగా వేట కొడవళ్లతో ఫారెస్ట్ రేంజ్ అధికారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఫారెస్ట్ రేంజ్ అధికారి తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే తోటి సిబ్బంది ఆయన్ను చండ్రుగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులు చేసిన దాడిలో గిరిజనులకు గాయాలైనప్పటికీ తొలిసారిగా సాగుభూమిదారులు దాడి చేయడం, ఈ దాడిలో రేంజ్ అధికారి శ్రీనివాసరావు మృతి చెందడంతో ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది.
కొండగొర్రె స్వాధీనం
ములుగు జిల్లా వాజేడు మండలంలోని గంగారం గ్రామంలో కొండగొర్రెను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంగారం గ్రామానికి చెందిన మేకల కాపరి తన మేకలను సమీపంలో ఉన్న అడవిలోకి మేపడానికి తీసుకెళ్లిన సమయంలో వాటితో కలిసి కొండగొర్రె ఇంటికి వచ్చింది. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు కొండగెర్రను స్వాధీనం చేసుకుని వరంగల్ కు తరలించారు.