Kavitha Arrest Notice : మనీలాండరింగ్ కేసులో కవిత అరెస్ట్ - ఢిల్లీకి తరలింపు
Telangana : ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి తరలించారు.
MLC Kavitha was detained by the authorities in Delhi liquor Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. ఆమెను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం నుంచి సోదాలు చేస్తున్న అధికారులు ఇంట్లో ఉన్న అందరి వద్ద ఫోన్లను ముందే సీజ్ చేశారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 3లో ఉన్న కవిత నివాసంలోనే ఉన్న ఈడీ అధికారులు ఆమెకు అరెస్ట్ వారంట్‌తో పాటు సెర్చ్ వారెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం నుంచి కవిత ఇంట్లో సోదాలు చేస్తున్నారు 12 మంది అధికారులు. ఇద్దరు మహిళా అధికార్లతోపాటు పదిమంది అధికారుల తనిఖీలు నిర్వహించారు. కవితను అరెస్ట్ చేస్తారన్న సమాచారం బయటకు రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కవిత నివాసం వద్దకు తరలి వచ్చారు. బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కవితను అదుపులోకి తీసుకుంటారని తెలియడంతో హరీష్ రావు, కేటీఆర్ .. హుటాహుటిన కవిత ఇంటి వద్దకు వచ్చారు. అయితే ఈడీ అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది వారిని ఇంట్లోకి అనుమతించ లేదు. కవిత ఇంట్లో సోదాలపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్ కుమార్, ప్రశాంత్ రెడ్డితో కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఆమెను ఈడీ అరెస్ట్ చేస్తే న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలనే విషయమై సమాలోచనలు చేశారు.
కేవితను అరెస్టు చేస్తారని బీఆర్ఎస్ నేతలు ఊహించలేదు. ఎందుకంటే.. లిక్కర్ కేసు విషయంలో దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని అందులో తెలిపారు. ఈ పిటిషన్ పరిష్కారమయ్యే వర కూ ఎలాంటి చర్యలు తీసుకోబోమని గతంలో ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది.
అందుకే సోదాల గురించి తెలిసి కవిత ఇంటి వద్దకు వచ్చిన కవిత న్యాయవాది సోమా భరత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణను ఈడీ పట్టించుకోదా? తీర్పు వచ్చేదాకా ఎలాంటి చర్యలు ఉండవని గతంలో ఈడీ హామీ ఇచ్చింది. ఈ టైంలో ఈ సోదాలు ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను అరెస్ట్ చేసే అవకాశం లేదన్నారు. కానీ ఈడీ అధికారులు అందరి అంచనాలను తలకిందులు చేశారు.