MLC Kavitha: కవిత అభ్యర్థనను నేడు సుప్రీంకోర్టు తిరస్కరించిందా? ఇదిగో క్లారిటీ, స్వయంగా ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ
కవిత అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిందంటూ ఉదయం నుంచి వార్తలు వస్తున్న వేళ స్వయంగా ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తాను ఈ రోజు ఎలాంటి పిటిషన్లు వేయలేదని ట్వీట్ చేశారు.
Supreme Court Rejects mlc Kavitha Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిందంటూ ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. దీంతో ఎమ్మెల్సీ కవిత దీనిపై స్పందించారు. తాను నేడు సుప్రీంకోర్టులో ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థలో వచ్చిన వార్తను రీట్వీట్ చేసిన కవిత.. ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. తాను ఇంతకుముందే దాఖలు చేసిన పిటిషన్ 24నే విచారణ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 20 న విచారణకు రావాలని ఈడీ ఇప్పటికే కవితకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకని 20 తేదీలోపే తన పిటిషన్‌పై విచారణ జరపాలని సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించినట్లుగా వార్తలు వచ్చాయి. వాటిని కల్వకుంట్ల కవిత ట్విటర్ ద్వారా ఖండించారు.
సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు వేశారంటే
ఈడీ అధికారుల విచారణ తీరుపై కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టులో నిన్న పిటిషన్ వేశారు. నిబంధనల ప్రకారం మహిళను ఇంటి దగ్గర ప్రశ్నించాలన్న తమ విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించిందని, అందుకే సుప్రీంకోర్టుకు వెళ్లామని కవిత నిన్న పిటిషన్ వేశారు. అందుకే తాను ఈడీ విచారణకు రాలేదని, సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాతే విచారణకు వస్తానని ఈడీకి కొన్ని డాక్యుమెంట్లు తన న్యాయవాది ద్వారా పంపారు. సీఆర్పీసీ ప్రకారం, మనీలాండరింగ్ యాక్ట్ 50 ప్రకారం.. మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాలని అన్నారు. 6 గంటల్లోనే విచారణ జరపాలన్న నిబంధన ఉందన్నారు. మహిళల హక్కులను కేంద్రం ఉల్లంఘిస్తోందని అన్నారు.
నిన్న (మార్చి 16) విచారణకు హాజరు కాని కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ ఎదుట మార్చి 16న విచారణకు హాజరు కావాల్సి ఉన్న కవిత హాజరు కాలేదు. ఈ విషయాన్ని ఆమె తరపు లాయర్ సోమా భరత్ స్పష్టం చేశారు. కవిత ఈడీ అధికారులకు రాసిన లేఖను ఈడీ కార్యాలయంలో ఇచ్చిన తర్వాత నిన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కవిత గురువారం ఈడీ విచారణకు హాజరు కాబోవడం లేదని ఆయన ప్రకటించారు. తన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. సుప్రీం కోర్టులో విచారణ తర్వాతే ఈడీ ఎదుట హాజరవుతానని కవిత ఈడీకి రాసిన లేఖలో తెలిపారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా సమన్లలో లేదని.. అందుకే లాయర్‌తో డాక్యుమెంట్లను పంపానని లేఖలో కవిత పేర్కొన్నారు.
రామచంద్ర పిళ్లై కస్టడీ పొడిగింపు
కవిత నిన్న ఈడీ విచారణకు హాజరయి ఉంటే ఈ కేసులో నిందితుడైన అరుణ్ రామచంద్ర పిళ్లైతో సహా కలిపి విచారణ చేయాలనే ప్రణాళిక ఉంది. కవిత గైర్హాజరు కావడం నేపథ్యంలో నిన్నటితో ముగిసిపోయిన రామచంద్ర పిళ్లై కస్టడీని కూడా ఈడీ అభ్యర్థన మేరకు ప్రత్యేక కోర్టు ఈ నెల 20 వరకూ పొడిగించింది. మార్చి 20న ఉదయమే కవిత-అరుణ్ పిళ్లైల మధ్య ముఖాముఖి విచారణ ఏర్పాటు చేసి, వాస్తవాలు రాబట్టుకునేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది.