Raja Singh: కేసీఆర్ వారికి ఆ పనులు చేసే లైసెన్సు ఇచ్చారా? వనమా దొరకలేదని చెప్పడం సిగ్గుచేటు: రాజాసింగ్
పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో పరారీలో ఉన్న నిందితుడు వనమా రాఘవేంద్రరావు కోసం జిల్లా పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.
పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఆ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావును ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఆయన వెనుక దాగి ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరని నిలదీశారు. ? ‘‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు చేసే అరాచకాలకు సీఎం కేసీఆర్ వత్తాసు పలుకుతుండు. వనమా రాఘవ ఆచూకీ దొరకలేదని పోలీసులు చెప్పడం సిగ్గు చేటు.. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే నిమిషాల్లో అరెస్టు చేసే పోలీసులు మానవ మృగాన్ని రోజుల తరబడి పట్టుకోలేకపోవడం సిగ్గు చేటు.
‘‘అధికార పార్టీ నేతలు హత్యలు, హత్యాచారాలు, బెదిరింపులకు పాల్పడవచ్చని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా లైసెన్సులు ఇచ్చారా? లేక అధికార పార్టీ నేతల అరాచకాలు ముఖ్యమంత్రికి, ఆయన కొడుకు కళ్లకు కన్పించకుండా కళ్లకు గంతలు కట్టుకున్నారా? తక్షణమే వనమా రాఘవను అరెస్టు చేయాలి. తండ్రి ఎమ్మెల్యేగా ఉంటే విచారణ సాఫీగా సాగే అవకాశం లేదు. తక్షణమే ఎమ్మెల్యే పదవికి వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలి. కొడుకుపై విచారణ జరిపేందుకు తండ్రి సహకరించాలి. ఈ అంశంపై సమగ్ర విచారణను పూర్తి చేసి నిందితుడికి సాధ్యమైనంత తొందరగా శిక్ష ఖారారు చేసేందుకు తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి’’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.
వనమా రాఘవ కోసం కొనసాగుతున్న గాలింపు
మరోవైపు, వనమా రాఘవేంద్రరావు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ‘‘పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో పరారీలో ఉన్న నిందితుడు వనమా రాఘవేంద్రరావు కోసం జిల్లా పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. రాఘవేంద్రరావును గుర్తించి పట్టుకుని అరెస్ట్ చేసేందుకు ఇతర జిల్లాల పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నాము. వీలైనంత త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నాము.’’ అని కొత్తగూడెం ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
వనమా రాఘవ ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు
వనమా రాఘవ ఆచూకీపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కుమారుడు కావడంతోనే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. రాఘవపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో కొత్తగూడెం బంద్‌ను కొనసాగిస్తున్నారు. తన కుమారుడిని అప్పగిస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చెప్పినా ఇప్పటి వరకు రాఘవ పోలీసుల ఎదుటకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు రాఘవ ఇంటికి నోటీసులు అతికించారు. 2001లో నమోదైన కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల్లోపు రావాలని అందులో పేర్కొన్నారు. మణుగూరు ఏఎస్పీ శబరీష్ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేశారు.
Also Read: Crime News: మంటల్లో కాలిపోతున్న భర్త.. చోద్యం చూస్తూ నుంచున్న భార్య, కొడుకు.. అసలేం జరిగిందంటే..
Also Read: పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్... వనమా రాఘవను అరెస్టు చేయలేదని ఏఎస్పీ ప్రకటన
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!