Prashanth Reddy: సోనియాను వైఎస్ బ్లాక్ మెయిల్ చేశారు: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి
Prashanth Reddy: నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాలాభిషేకం చేశారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు.
Prashanth Reddy: చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసిఆర్ అని కొనియాడారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. 2009 నవంబర్ 29న ఆనాటి ఉద్యమ నాయకుడు, ఈనాటి ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ జైత్ర యాత్రనో... కేసిఆర్ శవ యాత్రనో అని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నరోజని గుర్తు చేశారు. ప్రాణాలు సైతం లెక్కచేయని కేసిఆర్ మొండి ధైర్యం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని మంత్రి వెల్లడించారు. 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియా గాంధీ ప్రకటించిందని.. కానీ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణకు అడ్డు పడ్డారని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీని వీడుతా అని అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను, సోనియా గాంధీనీ బ్లాక్ మెయిల్ చేశారన్నారు.
చావునోట్లో తలపెట్టి గమ్యాన్ని ముద్దాడిన క్షణం..
— Vemula Prashanth Reddy (@VPRTRS) November 29, 2022
చరిత్రను మలుపు తిప్పినరోజు..
తెలంగాణ గతిని మార్చిన 'దీక్షా - దివస్'
జై తెలంగాణ...
జై జై తెలంగాణ !!#deekshadivas #telangana pic.twitter.com/sU8YDzGN35
దీక్షా దివస్ మలిదశ ఉద్యమానికి మలుపు రోజు..
వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే తెలంగాణలో వందలాది మంది విద్యార్థులు అమరులు అయ్యారని అన్నారు. 2009 డిసెంబర్ 9 ఇచ్చిన ప్రకటనను మళ్లీ వెనక్కి తీసుకోవడం వల్ల తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాన్చుడు వైఖరి వల్లే ఇదంతా జరిగిందన్నారు. ఆ పాపం కాంగ్రెస్ దే అన్నారు. ఐదేళ్ల ముందే రాష్ట్రం ఇచ్చి ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రగతి ఐదేళ్ల ముందు ఉండేదని అన్నారు. దీక్ష దీవస్ చరిత్రలో గొప్ప రోజు అని, మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు రోజు అని మంత్రి వేముల అన్నారు. తెచ్చుకున్న తెలంగాణను కేసిఆర్ ఆనతి కాలంలోనే నంబర్ వన్ గా దేశానికే ఆదర్శంగా నిలిపారని అన్నారు.
బీజేపీ మాయలో పడి ఆగం కావొద్దు..
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతి సాధిస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వo ప్రజల అవసరాలను గుర్తిస్తూ పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. తమ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధికి నయా పైసా నిధులు తీసుకురావడం చేతకాని బీజేపీ నాయకులు కులం, మతం, దేవుడి పేరుతో నిత్యం అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైరయ్యారు. దమ్ముంటే తమతో సమానంగా అభివృద్ధిలో పోటీ పడాలని, కేంద్రం నుంచి నిధులు తెచ్చి మొనగాడివని నిరూపించుకోవాలని బీజేపీ ఎంపీ అరవింద్ కు సవాల్ విసిరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ నిధులన్నీ గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, బిజెపికి చెందిన ఈ ప్రాంత ఎంపీ మాత్రం నిధులు తేలేక చేతులు ఎత్తేశారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రానికి మంచి చేస్తే మంచిది అన్నారు.