Puvvada Ajay on Polavaram: పోలవరం వల్లే భద్రాచలానికి ముప్పు, చెప్తున్నా పట్టించుకోట్లేదు: పువ్వాడ, సీఎం జగన్‌పైనా పరోక్ష వ్యాఖ్యలు
Polavaram Dam వల్ల గోదావరి వరద ప్రవాహం నెమ్మది అవుతోందని, భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోందని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.
Puvvada Comments on Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపు వల్ల భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఎన్నో గ్రామాలు వరద ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. ఈ డ్యామ్ వల్ల గోదావరి వరద ప్రవాహం నెమ్మది అవుతోందని, భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోందని చెప్పారు. పోలవరం డ్యామ్ ఎత్తును తగ్గించాలని గతంలోనే ఏపీ ప్రభుత్వాన్ని తాము కోరామని చెప్పారు. మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు.
సీఎం జగన్ గురించి పరోక్షంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో మొదటి నుంచి ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కోరారు. భద్రాచలం పక్కన ఉన్న ఐదు పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను తెలంగాణ ప్రభుత్వమే ఆదుకుందని, పార్లమెంటులో బిల్లు పెట్టి వాటిని తక్షణమే తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.
భద్రాచలాన్ని వరదలు ముంచెత్తిన వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమయ్యారని పువ్వాడ అజయ్ నిలదీశారు. కనీసం బాధితులను కలిసి పరామర్శించారా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఎవరైనా వచ్చి ఆర్థిక సాయం ప్రకటిస్తే బాగుంటుందని, గవర్నర్ భద్రాచలంలో పర్యటించడం వల్ల ఏం ఉపయోగం ఉందని అన్నారు. కాంగ్రెస్‌కు పార్టీకి అంతర్గత సమావేశాలే ముఖ్యమని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు వరద బాధితులను కలిసి ఏమైనా సహాయం చేశారా? అని ప్రశ్నించారు.
భద్రాచలం పట్టణానికి వరద నుంచి శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.వెయ్యి కోట్లను ప్రకటించిన విషయాన్ని పువ్వాడ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో వచ్చి, వరద బాధితులను కలిశారని చెప్పారు. వరద బాధితులను ముంపు ప్రాంతాల నుంచి తరలిస్తామని, వారికి శాశ్వత గృహాలను కట్టిస్తామని తెలిపారు.