Komatireddy Venkat Reddy: 'జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ ఉండదు' - కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana News: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తనకు, తన కుమారుడికి పదవి పోయిందనే బాధలో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. గొర్రెలు, చేపల పంపిణీ పేరిట రూ.వేల కోట్లు తిన్నారని ఆరోపించారు.
![Komatireddy Venkat Reddy: 'జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ ఉండదు' - కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు minister komati reddy venkat reddy sensational comments on brs chief kcr Komatireddy Venkat Reddy: 'జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ ఉండదు' - కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/b71606a073d18765449011cf33be93b11717322898290876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Minister Komatireddy Comments On Kcr: జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్‌లో ఎవరూ ఉండరని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్ట్ 15న దేశానికి స్వాతంత్ర్యం వస్తే.. జిన్నా ఆగస్ట్ 14న వేడుకలు చేసుకున్నట్లుగా కేసీఆర్ కూడా జూన్ 1 నుంచే వేడుకలు చేసుకున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు, ఆయన కుమారుడు కేటీఆర్‌కు పదవి పోయిందనే, బిడ్డ జైల్లో ఉందనే దుఃఖంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. గొర్రెల పెంపకం, చేపల పంపిణీపై రూ.వేల కోట్లు తిన్నారని.. వారి దగ్గర పని చేసే అధికారులు జైలుకు పోయారని ఆరోపించారు. 'కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై ఏ మాత్రం ప్రేమ లేదు. మంత్రి పదవి రాలేదనే కోపంతో అప్పట్లో తెలంగాణ ఉద్యమం చేపట్టారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో భోజనం చేయాలంటే రూ.లక్ష వసూలు చేసేవారు. తెలంగాణ ప్రజలంతా సోనియా గాంధీకి రుణపడి ఉండాలని చెప్పిన కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కారు.' అని కోమటిరెడ్డి గుర్తు చేశారు.
'మేడిగడ్డ మూడేళ్లలోనే కూలిపోయింది'
ప్రపంచంలో వింత అని చెప్పిన మేడిగడ్డ మూడేళ్లలోనే కూలిపోయిందని.. బ్యారేజీకి మరమ్మతులు చేసినా గ్యారెంటీ లేదని NDSA నివేదిక ఇచ్చిందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. 'చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చానని కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారు. తెలంగాణ దేవత అని సోనియా గాంధీని అని.. అనంతరం గద్దెనెక్కి సోనియా, రాహుల్ గాంధీలను తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ నిజస్వరూపం ప్రజలందరికీ తెలుసు. గ్యాస్ సిలిండర్ రూ.500కు ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ కు వచ్చిందా.?. లిక్కర్ స్కామ్‌లు, టానిక్ కంపెనీలు పెట్టుకోవడమే కేసీఆర్ చేశారు.' అని తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ చేసిన రైతు రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని.. వందల ఎకరాలున్న వారికి రైతు బంధు వేశారని మంత్రి మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కేబినెట్ మీటింగ్స్ పెట్టారంటూ నిలదీశారు. కేసీఆర్, ఆయన కొడుకు ఇద్దరూ జైలుకు పోవాల్సిన సమయం ఆసన్నమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్ట్ 15 నాటికి రూ.2 లక్షలు రుణమాఫీ చేయబోతున్నామని పునరుద్ఘాటించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)