(Source: ECI/ABP News/ABP Majha)
Singareni CMD: సింగరేణి సంస్థ ఛైర్మన్‌కు అరుదైన ఘనత - IIIE ప్రతిష్టాత్మక పెర్ఫార్మెన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డు అందజేత
Telangana News: సింగరేణి సంస్థ ఎండి ఎన్.బలరామ్‌ను IIIE ప్రతిష్టాత్మక పెర్ఫార్మెన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డు 2024 వరించింది. బొగ్గు ఉత్పత్తిలో సరికొత్త రికార్డు నెలకొల్పడంతోనే ఈ ఘనత దక్కింది.
Performance Excellence Award To Singareni MD And Chariman: సింగరేణి (Singareni) సంస్థ ఛైర్మన్, ఎండీ శ్రీఎన్.బలరామ్‌కు (N.Balaram) జాతీయ స్థాయిలో అరుదైన ఘనత దక్కింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (IIIE) సంస్థ ప్రతిష్టాత్మక పెర్ఫార్మెన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డు 2024ను ఆయన సొంతం చేసుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో శుక్రవారం రాత్రి జరిగిన 24వ జాతీయ స్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల సమావేశంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ శ్రీ ఎన్.బలరామ్ తరఫున డైరెక్టర్ (ఆపరేషన్స్, పర్సనల్ శ్రీ ఎన్.వి.కె.శ్రీనివాస్ ఈ అవార్డును స్వీకరించారు. అలాగే, కంపెనీల విభాగంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన కంపెనీగా సింగరేణికి పెర్ఫార్మెన్స్ ఎక్స్‌లెంట్ అవార్డును సైతం నిర్వాహకులు బహూకరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ నుంచి జనరల్ మేనేజర్ (ఎం ఎస్) టి.సురేష్ బాబు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర, డీజీఎం(ఐఈ) సీహెచ్ సీతారాంబాబు, IIIE గౌరవ కార్యదర్శి శ్రీ ఏవీవీ ప్రసాద్‌రాజు పాల్గొన్నారు.
700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్.బలరామ్ ఉత్పత్తి, ఉత్పాదకతల పెంపుపై నిరంతరం దృష్టి సారించారు. నిత్యం సమీక్షలు, గనుల వారీగా లక్ష్యాల సాధనకు నిరంతరం అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఆయన చూపిన చొరవతో 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ.. తన చరిత్రలోనే అత్యధికంగా 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని, బొగ్గు రవాణాను సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతేకాదు రూ.35,700 కోట్ల టర్నోవర్ సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఉత్పత్తి కన్నా అధికంగా సాధిస్తూ సరికొత్త రికార్డులు సృష్టించడంతో జాతీయ స్థాయిలో సింగరేణికి మంచి పేరు వచ్చింది. ఈ ఘనతలు సాధించిన క్రమంలోనే 'ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్' (IIIE) ఆయనకు వ్యక్తిగతంగా 'పెర్ఫార్మెన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డు - 2024ను' బహూకరించారు.
సింగరేణి సంస్థలోని ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషి వల్లే ఈ లక్ష్యాలు సాధించగలిగామని సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. సింగరేణి సంస్థ ఎన్నో ఘనతలు సాధించినట్లు వివరించారు. సింగరేణికి లభించిన అవార్డులు సంస్థ ఉద్యోగులకే చెందుతాయని, ఈ స్ఫూర్తితో మరింతగా పని చేస్తూ ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.