Harish Rao: తెలంగాణ వల్ల నాలుగు రాష్ట్రాలకు లబ్ధి - చంద్రబాబుకు మంత్రి హరీశ్ రావు కౌంటర్
తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షల ఎకరాలలో వరిసాగు చేస్తే, ఆంధ్రప్రదేశ్లో కేవలం 16 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు అయ్యిందని హరీశ్ రావు అన్నారు.
తెలంగాణలో ఎప్పటి నుంచో వరి అన్నం తింటున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. తానే అన్నం తినడం నేర్పానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాకముందు అక్కడి ప్రజలు జొన్న, మక్కలు గట్క తప్ప ఏమీ తినలేదనడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన వారి ధాన్యం వల్ల నాలుగు రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతోందని, ఆ రాష్ట్రాలకు తెలంగాణే అన్నం పెడుతుందని అన్నారు. సిద్ధిపేట రూరల్ మండలం చిన్న గుండవెళ్లిలో హరీష్ రావు ఆదివారం (మార్చి 5) పర్యటించారు. చిన్న గుండవెళ్లిలో రైతు వేదికను మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడారు.
ఈ యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షల ఎకరాలలో వరిసాగు చేస్తే, ఆంధ్రప్రదేశ్లో కేవలం 16 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు అయ్యిందని అన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ ఆలోచనలతో అనేక సంక్షేమ పథకాలతో గొప్ప మార్పు వచ్చి అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ప్రతిపక్షాలకు ఏమని విమర్శించాలో అర్థం కాక సతమతమవుతున్నారని అన్నారు.
ఆయిల్ ఫామ్ సాగు కోసం బడ్జెట్లో రూ.వెయ్యికోట్ల సబ్సిడీ కింద అందిస్తున్నామని చెప్పారు. రైతులు ఆయిల్ ఫామ్ పంటలు సాగుచేసే దిశగా అడుగులు వేయాలని సూచించారు. రైతులకు మేలు చేకూర్చాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని హరీష్ రావు అన్నారు.
వ్యవసాయ మంత్రి కూడా కౌంటర్
తెలంగాణలో ‘ఇంటింటికీ తెలుగు దేశం’ కార్యక్రమం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తెలుగు దేశం వచ్చాకే తెలంగాణలో మొదటిసారి అన్నం వండుకు తిన్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని, మూర్ఖపు అహంకారానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. దేశంలోనే తొలిసారి వరి అన్నం తిన్న ప్రజలు తెలంగాణ వారేనని చెప్పారు. 11వ శతాబ్దం నాటికే కాకతీయుల కాలంలో నిర్మించబడ్డ గొలుసుకట్టు చెరువుల కింద తెలంగాణలో వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసలు, అల్లం, పసుపు, ఉల్లి, చెరుకు పంటలు పండించారన్నారు. 15వ శతాబ్దం నాటికి బియ్యంతో చేసే హైదరాబాద్ దమ్ బిర్యానీ ప్రసిద్ధి అని గుర్తు చేశారు.
కాసాని క్లారిటీ
మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చంద్రబాబు మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడుతున్నారని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు ఏం జరిగిందన్న విషయమే చంద్రబాబు ప్రస్తావించారు తప్ప.. మరొకటి కాదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపారని ఆయన గుర్తుచేశారు. ధమ్ కా బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో నిరంజన్ రెడ్డి చెప్పాలి? అని కాసాని ప్రశ్నించారు. ఎవరి పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందో ప్రజలకు తెలుసని అన్నారు. అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు పంపిణీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఒక్క మీటింగ్ పెడితే బీఆర్ఎస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.