Minister Harish Rao: అత్యధిక పంటలు పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ: హరీశ్ రావు
Minister HarishRao: పంటల సాగులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇతర రాష్ట్రాల కంటే అత్యధిక పంటలు పండిస్తున్నట్లు పేర్కొన్నారు.
Minister Harish Rao: తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. తెలంగాణలో అత్యధికంగా పంటలు పండుతున్నాయని హరీశ్ రావు అన్నారు. కోటి 35 లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కొనియాడారు. గురువారం మెదక్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ హేమలత అధ్యక్షతన కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రారంభమైన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. రాష్ట్రంలో పండుతున్న పంటలు, పంట దిగుబడులపై హరీశ్ రావు మాట్లాడారు. కాళేశ్వరం ద్వారా భవిష్యత్ లో మరిన్ని ఫలితాలు పొందుతారని హరీశ్ రావు పేర్కొన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడంతో.. చివరి గింజ వరకు కొనుగోలు చేశామని చెప్పారు.
'విదేశాలకు అమ్మకుండా సెస్ విధించారు'
విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు పంపకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సెస్ వేసిందని విమర్శించారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తోందని... మోదీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రైతులను విస్మరిస్తోందని హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. అలాగే రాష్ట్రంలో పంటల పరిస్థితిపై అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్ల ఈ సందర్బంగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. వానాకాలం వడ్ల కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు హరీశ్ రావు పేర్కొన్నారు.
'ఒకప్పుడు కరువు.. ఇప్పుడు ధాన్యాగారం'
తెలంగాణ అంటే ఒకప్పుడు కరువు కాటకాలతో దుర్భర పరిస్థితి ఎదుర్కొందని కానీ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఈ సందర్భంగా హరీశ్ రావు కొనియాడారు. కూడవెల్లి పారుతుందని కలలో కూడా అనుకోలేదని మంత్రి అన్నారు. అలాంటి ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లు పారించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు 70 ఏళ్ల పాటు పాలించి రాష్ట్ర ప్రజలకు గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వలేక పోయాయని మంత్రి విమర్శలు గుప్పించారు.
'ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు వలసలు'
యాసంగిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని హరీశ్ రావు వెల్లడించారు. కరోనా మూలంగా కార్మికుల కొరత, సంచుల కొరత.. ఏర్పడినా అన్ని ఇబ్బందులను అధిగమనించి రైతుల నుండి పంటను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. సాగు నీటి వసతి వల్ల తెలంగాణలో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఒకప్పుడు తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలకు వలసలు ఉండేవని.. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణకు వచ్చి ఉపాధి పొందుతున్నారని అన్నారు. బీహార్ నుండి కూలీలు వచ్చి తెలంగాణలో వరి నాట్లు వేస్తున్నారని.. రాష్ట్రంలోని డైరీ ఫామ్ లలో పాలు పితకడానికి చుట్టు పక్కల రాష్ట్రాల వాళ్లు వస్తున్నారని, ఇతర పనులు చేసుకునేందుకు వేలాది మంది రాష్ట్రానికి వచ్చి ఉపాధి పొందుతున్నట్లు హరీశ్ రావు చెప్పారు.