Maoist warning: చంపేస్తాం దమ్మంటే దాక్కో - మెదక్ ఎంపీకి ఫోన్ కాల్ - తర్వాతేం జరిగింది?
Maoists: మెదక్ ఎంపీకి మావోయిస్టుల పేరుతో బెదిరంపు కాల్ వచ్చింది. సాయంత్రంలోపు చంపేస్తాం కాపాడుకోవాలని ఆ కాల్‌లో హెచ్చరించారు.

Medak MP receives threatening call: మెదక్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు మధ్యప్రదేశ్‌కు చెందిన మావోయిస్టుల నుండి బెదిరింపు కాల్ వచ్చింది. ఈ బెదిరింపు కాల్ గురించి రఘునందన్ రావు తెలంగాణ డీజీపీ మరియు మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో మావోయిస్టులను అణిచివేస్తోంది. ఆపరేషన్ కగార్ పేరుతో.. వారిని నిర్మూలిస్తామని కేంద్రం ప్రకటించింది. వరుసగా ఎన్ కౌంటర్లు చేస్తూ మావోయిస్టుల కంచుకోటల్ని బద్దలు కొడుతున్నారు. కీలక నేతల్ని ఎన్ కౌంటర్ చేస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టుల పేరుతో ఈ బెదిరంపు కాల్ రావడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను అణిచి వేస్తున్న కేంద్రం
అయితే మధ్యప్రదేశ్ లో మావోయిస్టుల ప్రాబల్యం కాస్త తక్కువే. మధ్యప్రదేశ్ , చత్తీస్ ఘడ్ కలిసి ఉన్న సమయంలో.. ఛత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో ఎక్కువగా నక్సల్స్ సమస్య ఉండేది. మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్ ఘడ్ విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రంలో మావోయిస్టుల సమస్య దాదాపుగా లేదు. కొన్ని చోట్ల ఉనికి ఉన్నా.. ఎప్పటికప్పుడు అణిచివేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎందుకు మధ్యప్రదేశ్ నుంచి.. బెదిరింపు కాల్ వచ్చిందన్నది తెలియాల్సి ఉంది. అయితే మావోయిస్టులు ఇలా చంపేస్తామని ఫోన్లు చేసి బెదిరించరని పోలీసులు అంటున్నారు. ఖచ్చితంగా ఇది ఫేక్ కాల్ అనే అభిప్రాయానికి వస్తున్నారు.
రఘునందన్ కు ఫోన్ చేసి బెదిరించాల్సిన అవసరం ఏముంది ?
రఘునందన్ రావు బీజేపీ ఎంపీనే కానీ మావోయిస్టుల విషయంలో గతంలో ఆయన అత్యంత వివాదాస్పదంగా మాట్లాడింది ఏమీ లేదు. ఆయనను మావోయిస్టులు ప్రత్యేకంగా టార్గెట్ చేయరు. పైగా మావోయిస్టుల ఉనికి లేని ప్రాంతానికి ఆయన ఎంపీగా ఉన్నారు. ఏ కోణంలో చూసినా ఇది ఆకతాయిల పనిగా భావిస్తున్నారు. ఎంపీగా ఆయనకు ఉండే భద్రతతో పాటు... మెదక్ పోలీసులు మరింత భద్రత కల్పించినట్లుగా తెలుస్తోంది. బెదిరింపు కాల్ ను విశ్లేషించి.. ఎవరు చేశారన్నది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
బెదింపు కాల్ గానే భావిస్తున్న పోలీసులు
ఈ అంశంపై పోలీసులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎంపీ మాత్రం తనకు వచ్చిన ఫోన్ కాల్ రికార్డింగును పోలీసులకు అప్పగించారు. రాజకీయ కారణాలతో.. భయపెట్టేందుకు చేశారా.. నిజంగానే మావోయిస్టులా అన్నది పోలీసులు తేల్చనున్నారు. ఆ తర్వాత అసలు విషయాలు వెల్లడించే అవకాశం ఉంది.





















