Gandhi Bhavan: గాంధీ భవన్‌లో గొర్రెలు, మేకలతో నిరసన తెలిపిన యాదవుల డిమాండ్‌లు ఇవే
Gandhi Bhavan: 11 డిమాండ్ల పరిష్కారం కోరుతూ హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద యాదవ సంఘాలు నిరసన తెలిపాయి. గొర్రెలు, మేకలతో ఆందోళన చేపట్టాయి.

Gandhi Bhavan: తెలంగాణలోని గాంధీ భవన్ మరోసారి వినూత్న నిరసనకు వేదిక అయింది. యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెబుతూ ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆందోళన బాటపట్టారు. గొర్రెలు, మేకలను గాంధీ భవన్ ఎదుట మేపుతూ తమ డిమాండ్లు పరిష్కరించాలని నినదించారుు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని యాదవ సంఘాలు నినదించాయి. మంత్రిపదవి ఇవ్వలేదని ఆక్షేపించాయి. గొర్రెలు, మేకలకు మందులు కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాదిన్నర దాటిందని ఇంకా న్యాయం చేయలేదని వాపోయారు. మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా తగిన న్యాయం చేయలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీసం తమ సామాజిక వర్గాల ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలైనా సరిగా అందజేయాలని డిమాండ్ చేశారు.
#WATCH | Telangana | Members of the Yadav community staged a protest with sheep and goats at the Telangana Congress headquarters at Gandhi Bhavan in Hyderabad, demanding a ministerial berth for their community.
— ANI (@ANI) June 23, 2025
The protesters say, "Today, we staged a protest at the Telangana… pic.twitter.com/huWFPXy2u0
గాంధీ భవన్‌లో నిరసన తెలిపిన నేతలను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ అరెస్టు చేసే క్రమంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై నేతలు మండిపడ్డారు. తమతోపాటు మూగజీవాలను కూడా ఇడ్చిపడేశారని ఆక్షేపించారు. తమతో తీసుకొచ్చిన గొర్రెలను, మేకలను డీసీఎంలోకి విసిరేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని జీవాలకు గాయాలు చేశారని ఆరోపించారు.
యాదవ సామాజిక వర్గం తమ డిమాండ్‌లను మీడియాకు అందజేశారు. అవేంటంటే... మంత్రివర్గంలో యాదవ, కురుమలకు స్థానం కల్పించాలి. జనాభా ప్రకారం రాష్ట్ర, జిల్లా పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. వెంటనే వాటిని భర్తీ చేయాలి. ప్రభుత్వ కార్పొరేషన్, నామినేటికి పదవుల్లో కూడా తగిన అవకాశాలు కల్పించాలి. 10వేల కోట్లతో యూదవ, కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. గొర్రెలు, మేకలకు వచ్చే వ్యాధులకు ఉచితంగా మందులు ఇవ్వాలి. నట్టల మందులను తక్షం విడుదల చేయాలి.
తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల రెగ్యులేటరీ మార్కెట్ తక్షణమే ఏర్పాటు చేయాలి. 50 సంవత్సరాలుపైబడిన గొర్రెల కాపరులకు 6,000 రూపాయల పింఛన్ అందించాలి. కాపరులకు ఇచ్చే పరిహారం 10 లక్షలకు పెంచాలి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వంద కోట్ల ఎన్పీడీసీ రుణాలు వెంటనే మాఫీ చేయాలి. తెలంగాణాలో ఉన్న ప్రతి గొర్రె, మేకకు ఇన్ఫూరెన్స్ అందివ్వాలి. ప్రతి నియోజకవర్గంలో గొర్రెల, మేకల మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి. జిల్లాకో మీట్ ప్రాసెసింగ్ యూనిటీ నిర్మించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంపై హరీష్ సెటైర్లు
గాంధీభవన్‌లో జరిగిన నిరసనలపై మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. సెటైర్లతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. "సన్నాలకు బోనస్ బంద్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంద్, గ్యాస్ బండకు రాయితీ బంద్, రాజీవ్ యువ వికాసం అమలుకు కాకముందే బంద్, బిఆర్ఎస్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్" అని మండిపడ్డారు.
గత ప్రభుత్వం చేపట్టిన పథకాలను రద్దు చేసి తాము ఇచ్చిన హామీలను కూడా గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠఆత్మశుద్ధిలేని యాచార మదియేల భాండశుద్ధి లేని పాకమేల? అన్నట్లుంది కాంగ్రెస్ పరిస్థితి. బీఆర్‌ఎస్ ప్రవేశ పెట్టిన పథకాలను అటకెక్కించారు, మేనిఫెస్టోలో ఊదరగొట్టిన హామీల అమలు గాలికి వదిలేశారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవు. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్. అని విమర్శలు చేశారు.
సన్నాలకు బోనస్ బంద్
— Harish Rao Thanneeru (@BRSHarish) June 23, 2025
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంద్
గ్యాస్ బండకు రాయితీ బంద్
రాజీవ్ యువ వికాసం అమలుకు కాకముందే బంద్
బిఆర్ఎస్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్
ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్..
ఆత్మశుద్ధిలేని యాచార మదియేల
భాండశుద్ధి లేని పాకమేల?… pic.twitter.com/6EWZ96Orxy
పాలన అంటే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు తీర్చుకోవడం కాదన్నారు హరీష్‌రావు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని అభయ హస్తం మేనిఫెస్టోలో ఊదరగొట్టారు ఇప్పుడు ఏమైందని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. గొర్రెల పంపిణీ దేవుడెరుగు, కట్టిన డిడి పైసలు కూడా వాపస్ ఇవ్వలేని దుస్థితి మీదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి మాటలు విని విని విసిగి పోయిన యాదవ, కురుమలు గాంధీ భవన్‌లో నిరసన తెలియచేశారని సెటైర్లు వేశారు.
రేవంత్ మోసాన్ని గుర్తించి, అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ భవన్‌కు పోటెత్తకముందే కళ్ళు తెరువాలని సూచించారు హరీష్. చెప్పిన గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు ఇకనైనా అమలు చేయకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.





















