TSPSC Chairman: TSPSC ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి బాధ్యతలు
TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఇద్దరు సభ్యులతో ప్రమాణం చేయించారు.
Mahendar Reddy Takes Charge as TSPSC Chairman: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి (Mahendar Reddy) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సభ్యులుగా పాల్వాయి రజినీకుమారి (Rajini Kumari), అనితా రాజేంద్రతో మహేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఆయన టీఎస్ పీఎస్సీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహేందర్ రెడ్డి ఈ పదవిలో 11 నెలలు కొనసాగుతారు. టీఎస్ పీఎస్సీ నిబంధనల ప్రకారం ఛైర్మన్, కమిషన్ సభ్యులుగా నియమితులైన వారు 62 ఏళ్లు వచ్చే వరకూ మాత్రమే ఆ పదవిలో కొనసాగేందుకు అవకాశం ఉంది. అలాగే, ఆరేళ్ల పాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగుతారు. 1962 డిసెంబర్ 3న జన్మించిన మహేందర్ రెడ్డికి ప్రస్తుతం 61 ఏళ్లు కాగా.. ఇంకో 11 నెలల్లో ఆయనకు 62 ఏళ్లు నిండుతుంది. దీంతో ఆయన 11 నెలలు పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
గవర్నర్ ఆమోద ముద్రతో
గతంలో TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడగా.. కమిషన్ ను పూర్తిస్థాయిలో ప్రక్షాళించి పకడ్బందీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ సిఫారసు మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి (Mahendar Reddy) నియామకానికి గవర్నర్ తమిళిసై (Tamilisai) గురువారం ఆమోదం తెలిపారు. ఆయనతో పాటు మరో కమిషన్ సభ్యులుగా మరో ఐదుగురి నియామకానికి ఆమోద ముద్ర వేశారు. ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజినికుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై.రామ్మోహన్ రావులను సభ్యులుగా నియమించారు. కాగా, కమిషన్ నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా ఛైర్మన్ పదవి కోసం 50 మంది సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఎ.శాంతికుమారి (Shanthi kumari), న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి (Tirupathi), సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మల(Nirmala)తో కూడిన స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను పరిశీలించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని ప్రతిపాదిస్తూ గవర్నర్ తమిళిసైకు ఫైల్ పంపారు. దీనికి గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో టీఎస్ పీఎస్సీ కొత్త టీం సిద్ధమైంది.
ఛైర్మన్ మహేందర్ రెడ్డి గురించి
టీఎస్ పీఎస్సీ నూతన ఛైర్మన్ గా నియమితులైన మహేందర్ రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కృష్ణాపురం గ్రామం. ఆయన 1986వ ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన వారు. ఆయన రామగుండం ఏఎస్పీగా తొలుత బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నిజామాబాద్, కర్నూలు ఎస్పీగా పని చేశారు. జాతీయ పోలీస్ అకాడమీలో ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించిన మహేందర్ రెడ్డి.. చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసిన సైబరాబాద్ కమిషనరేట్ కు మొదటి కమిషనర్ గా నియమితులయ్యారు. మూడేళ్లు సైబరాబాద్ సీపీగా సుదీర్ఘంగా సేవలందించి పోలీస్ శాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తర్వాత గ్రేహౌండ్స్, పోలీస్ కంప్యూటర్ విభాగాల్లో విధులు నిర్వహించారు. కీలక ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగానూ పని చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి.. ఫ్రెండ్లీ పోలీసింగ్ వంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2017 నవంబర్ లో తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి 2022 డిసెంబర్ వరకూ ఆ పదవిలో కొనసాగారు. తాజాగా, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యారు.
ఉద్యోగాల భర్తీపై ఫోకస్
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త టీం సిద్ధం కావడంతో ఇక ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ సహా గ్రూప్-2 పరీక్షలతో పాటు ఇప్పటివరకూ పరీక్షల తేదీలు ప్రకటించని నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ అనుసరిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెరుగైన విధానాలను కమిటీ అధ్యయనం చేసింది.