Yennam Srinivas Reddy: టీ కాంగ్రెస్‌లో నయా జోష్, పార్టీలో చేరిన మరో మాజీ ఎమ్మెల్యే
Yennam Srinivas Reddy: కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరారు.
Yennam Srinivas Reddy: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలన్నీ ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి దిగి బహిరంగ సభలతో స్పీడ్ పెంచుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా పార్టీలన్నీ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో పాటు పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాయి. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు వెంటనే గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాయి. అంతేకాకుండా ఆలస్యం చేయకుండా వెంటనే పార్టీలో చేర్చుకుంటున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ కంటే కాంగ్రెస్‌లోకి బాగా వలసలు పెరిగిపోయాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్న వేళ కాంగ్రెస్‌లోకి భారీగా ఇతర పార్టీల నుంచి నేతలు చేరుతున్నారు. వరుస పెట్టి అగ్రనేతల సమక్షంలో పార్టీ కండువాలు కప్పేసుకుంటున్నారు. నిన్న పలువురు చేరగా.. ఆదివారం మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీనివాస్ రెడ్డికి మల్లిఖార్జున ఖర్గే పార్టీ కండువా కప్పి సాదరంగా కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. శ్రీనివాస్ రెడ్డితో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన ఉపేందర్ రెడ్డి, ఖమ్మం కార్పొరేటర్ దొడ్డ నగేష్, మస్కతి డైరీ ఛైర్మన్ అలీ మస్కతి కాంగ్రెస్‌లో చేరారు.
యెన్నం శ్రీనివాస్ రెడ్డి 2012 ఉప ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ గత కొంతకాలంగా బీజేపీలోని పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయనను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది. దీంతో కాంగ్రెస్‌తో గత కొంతకాలంగా శ్రీనివాస్ రెడ్డి టచ్‌లో ఉంటున్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ ఎట్టకేలకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటించారు పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంతో పాటు అక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడారు. ఈ క్రమంలో యెన్నం కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం.
అయితే రెండు రోజులుగా హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీతో పాటు ముఖ్యనేతలందరూ నగరానికి వచ్చారు. శనివారం జరిగిన తొలి సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు. నేటితో సమావేశాలు ముగియనుండగా.. సాయంత్రం తుక్కుగూడలో విజయభేరి బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహించనుంది. ఈ సభ వేదికగా వచ్చే తెలంగాణ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. ఈ సభలో ఆరు కీలక ఎన్నికల హామీలను సోనియాగాంధీ స్వయంగా ప్రకటించనున్నారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ హామీలు ఏమై ఉంటాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సభ నేపథ్యంలో కాంగ్రెస్‌లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. శనివారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు చేరగా.. ఇవాళ శ్రీనివాస్ రెడ్డి చేరారు. సభలో చేరికలు ఉండవని, అంతకుముందే అగ్రనేతల సమక్షంలో చేరికలు ఉంటాయని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ చేరికలు పార్టీకి ఎంతో కలిసి వస్తాయని, శ్రేణుల్లో మరింత జోష్ పెరుగుతుందని తెలిపారు.