Telangana Jobs: పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థి - న్యాయం చేయాలంటూ వేడుకోలు
పోస్టల్ శాఖ నిర్లక్ష్యం కారణంగా తాను గవర్నమెంట్ జాబ్ కోల్పోయానంటూ ఓ అభ్యర్థి, అతడి కుటుంబం పోస్టాఫీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఈ ఘటన జరిగింది.
పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం, ఇంటర్వ్యూ లెటర్ జాప్యం కావడంతో ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థి
పోస్ట్ మ్యాన్ ఇంటర్వ్యూ లెటర్ ఆలస్యంగా ఇవ్వడంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయిన యువకుడు....!
జడ్చర్ల: పోస్టల్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయాడు. అహర్నిశలు శ్రమించి ప్రిపేరయ్యాడు. తీరా జాబ్ చేతికొచ్చే సమయంలో జరిగిన ఘటన ఆ అభ్యర్ధికి ఉద్యోగాన్ని దూరం చేసింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది.
ఇంటర్వ్యూ లెటర్ ఆలస్యం, జాబ్ కోల్పోయిన యువకుడు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ కి చెందిన నాగరాజు అనే యువకుడు రాష్ట్ర విద్యుత్ శాఖలో సబార్డినేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రక్రియ దాదాపు పూర్తయింది. అధికారులు గత నెల సెప్టెంబర్ 27 లోపు ఇంటర్వ్యూకి హాజరు కావాలని అభ్యర్థి నాగరాజుకి కాల్ లెటర్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారు. కానీ ఆ ఇంటర్వ్యూ లెటర్ పోస్ట్ బాధితుడు నాగరాజుకు అక్టోబర్ 4న అందింది. అంతకు దాదాపు పది రోజుల ముందు రావాల్సిన సబార్డినేట్ పోస్ట్ ఇంటర్వ్యూ లెటర్ ఆలస్యంగా రావడంతో నాగరాజు ఆ ఉద్యోగాన్ని కోల్పోయాడు. దాంతో అధికారులు నాగరాజు బదులుగా ఇంటర్వ్యూకు హాజరైన మరో అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చారు.
జరిగిన ఘటనతో అభ్యర్థి నాగరాజుతో పాటు అతడి కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. చేతి వరకొచ్చిన కూడు నోటికి రాకుండా అడ్డుకున్నారు అనే తీరుగా... ఇంటర్వ్యూ కాల్ లెటర్ అధికారులు స్పీడ్ పోస్టులో పంపించినా, పోస్టల్ శాఖ, పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయామని నాగరాజు, అతడి కుటుంబసభ్యులు తెలిపారు. గవర్నమెంట్ కోల్పోవడానికి పోస్టల్ శాఖనే కారణమంటూ సంబంధిత శాఖ అధికారులతో అభ్యర్థి నాగరాజు, అతడి కుటుంసభ్యులు వాగ్వాదానికి దిగి, న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు, సంబంధిత శాఖ ఏమైనా స్పందించి అభ్యర్థి నాగరాజుకు ఏమైనా సహాయం చేస్తుందా అనేది తెలియాలంటే వేచి చూద్దాం.