Dasara 2022 : రూ.5.55 కోట్ల నగదుతో అమ్మవారి అలంకరణ, దర్శనానికి పోటెత్తిన భక్తులు!
Dasara 2022 : దేవీ నవరాత్రుల్లో భాగంగా మహబూబ్ నగర్ లోని బ్రాహ్మణవాడి దేవాలయంలో అమ్మవారి భారీ కరెన్సీతో అలంకరించారు. కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ చూసేందుకు భక్తులు పోటెత్తారు.
Dasara 2022 : దేశవ్యాప్తంగా దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని ఐదు కోట్ల యాభై ఐదు లక్షల యాభై ఐదువేల ఐదు వందల యాభై ఐదు రూపాయల యాభై ఐదు పైసలతో అలంకరణ చేశారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడి దేవాలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. శుక్రవారం అమ్మవారు లక్ష్మీదేవి అవతారం భక్తులకు దర్శనం ఇవ్వడంతో ఆలయ నిర్వాహకులు అమ్మవారి గుడిని ఐదు కోట్ల 55 లక్షల 55 వేల ఐదు వందల యాభై ఐదు రూపాయల 55 పైసలతో అమ్మవారిని అలంకరణ చేశారు. దీంతో అమ్మవారిని చూడడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు.
రూ.5.55 కోట్లకు పైగా నగదుతో
మహబూబ్‌నగర్ జిల్లాలో దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి ఐదు కోట్లకు పైగా నగదుతో అలంకరించారు. అమ్మవారి అలంకరణకు రూ. 5,55,55,555.55 కరెన్సీని వినియోగించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బ్రహ్మణవాడిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో రూ. 10, 20, 50, 100, 200, 500 నోట్లతో అమ్మవారిని అలంకరించారు.
మహాలక్ష్మీ అవతారం
మంగళప్రదమైన దేవత ఈ మహా లక్ష్మీ. మూడు శక్తుల్లో ఒకటి ఈ మహాలక్ష్మి రూపం. అమిత పరాక్రమం చూపి హలుడు అనే రాక్షస సంహారార్థం అవతరించిన తల్లి మహాలక్ష్మి. లోకస్థతి కారిణి, ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ముల సమష్టి రూపంలో దుర్గమ్మను మహాలక్ష్మి దేవిగా ఈరోజు కొలుచుకుంటారు. మహాలక్ష్మీ సర్వ మంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తిత్రయంలో మధ్య శక్తి. మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీ సప్తసతి చెబుతోంది.
సంపదకు ప్రతిరూపం
శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అంటేనే సంపదకు ప్రతిరూపం! అందుకనే ఆ తల్లిని ‘శ్రీ మహాలక్ష్మి’ అని పిలుస్తారు. ‘శ్రీ’ అంటే సిరిసంపదలే. అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా నెరవేరుతుందని నమ్మకం. అమ్మవారు అనుగ్రహించే వరాలను బట్టి ఆమెను ఎనిమిది రూపాలలో పూజిస్తారు. వాళ్లే అష్టలక్ష్ములు. దసరా సందర్భంగా మహాలక్ష్మిని కనుక పూజిస్తే ఈ అష్టలక్ష్ములంతా అనుగ్రహిస్తారు. దసరా సమయంలో అమ్మవారిని గులాబి రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఇక పాలసముద్రం నుంచి ఉద్భవించినందుకు ప్రతీకగా ఆ తల్లికి తెల్లటి కలువలతో పూజ చేయాలి. తెల్ల కలువులతో పూజ చేయడం కుదరకపోతే అదే రంగులో ఉండే మల్లెలాంటి పూలతో అయినా అర్చించవచ్చు. ఇక అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్ని గుర్తుచేసుకుంటూ పాలతో చేసిన పరమాన్నాన్ని తల్లికి నివేదించాలి. పరమాన్నం చేయడం కుదరని పక్షంలో అటుకులు, బెల్లం, కొబ్బరి కలిపిన ప్రసాదాన్ని కూడా సమర్పించవచ్చు.