Mahabubabad News : బొడ్రాయి నిర్మాణంలో వివాదం, మూడు కుటుంబాలను బహిష్కరించిన గ్రామస్థులు!
Mahabubabad News : మహబూబాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో మూడు కుటుంబాలను వెలివేశారు గ్రామస్థులు. బొడ్రాయి నిర్మాణంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది.
Mahabubabad News : మహబూబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బొడ్రాయి పండుగ సందర్భంగా కొత్త బొడ్రాయి నిర్మించే క్రమంలో వివాదం తలెత్తింది. కొత్తగా నిర్మించే బొడ్రాయి తమ ఇంటి వద్ద నిర్మించవద్దని అన్నందుకు మూడు కుటుంబాలను ఊరుతో ఎటువంటి సంబంధం లేదన్నట్టు వెలివేశారు ఇతర గ్రామస్థులు. ఈ క్రమంలో ఘర్షణ కూడా చోటు చేసుకుంది. సీసీ రోడ్డుపై బొడ్రాయి వేస్తారా? మంచి నీళ్లకు వెళ్లాలన్న అడ్డంగా ఉంటుందనడంతో తమపైకి దౌర్జన్యంగా వచ్చి ఘర్షణ పడ్డారని బాధితులు వాపోతున్నాయి. గ్రామంలోకి ప్రవేశం లేదని ఇళ్ల ముందు రాళ్లు, చెట్లు అడ్డంగా వేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ మూడు కుటుంబాల బాధితులు పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై సతీష్ గౌడ్ గ్రామాన్ని సందర్శించి ఇరు పక్షాలతో మాట్లాడి సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేశారు.
మంత్రగాళ్లని నిందలు!
"ఈ జాగా 12 మంది పొత్తుల్లో తీసుకున్నాం. ఆరుగురికి ముందుకు, ఆరుగురికి వెనుకకి ఇచ్చారు. దానికి డొంక తీశారు. మేము సీసీ రోడ్డు వేసుకున్నాం. ఈ సీసీ రోడ్డు మధ్యలో బొడ్రాయి పెడతామన్నారు. సీసీ రోడ్డులో బొడ్రాయి పెట్టకండి. పక్కకి పెట్టండని వేడుకున్నాను. అయినా ఊర్లోవాళ్లు వినలేదు. దీంతో నేను ఎస్సై సార్ దగ్గరకి పోయి పిటిషన్ పెట్టాను. ఎస్సై సార్ వచ్చి బొడ్రాయి రోడ్డు మధ్యలో పెట్టొద్దని, పక్కకి పెట్టుకోండని చెప్పారు. దారి గుండా నడవొద్దని బండలు వేసిర్రు. బండలు వేస్తే ఎట్లా పోయాలని అడిగితే నిమ్మకాయలు వేసిర్రు. మళ్లీ ఎస్సై సార్ దగ్గర పోయాం. దీంతో పోలీసులు, సర్పంచ్ సిబ్బంది వచ్చి బండలు తీసేశారు. బిందె పట్టుకుని బోరింగ్ కాడికి నీళ్లకు పోతావుంటే. మీరు రావొద్దు మీరు మంత్రగాళ్లు అని మమ్మల్ని నీళ్లకు కూడా రానియ్యడంలేదు. నెలా పది రోజుల అయితాంది. మేము నీళ్లు కూడా పోతాల్లేదు." - జాటోత్ గంగమ్మ, బాధితురాలు
బొడ్రాయి అంటే
పల్లెల్లో గ్రామానికి సంబంధించిన ముఖ ద్వారం ఉంటుంది. దానిని ఊరి వాకిలి, చావిడి, గ్రామ ప్రవేశ ద్వారం అని పిలుస్తారు. ఈ చావిడి మధ్యలో బొడ్రాయిని పాతుతారు. కొన్ని గ్రామాలలో ఊరి బయట బొడ్రాయిని ఉంచుతారు. చావిడిలో బొడ్రాయిని ఉంచిన గ్రామాలలో ఊరి బయట లింగమయ్య పేరుతో మరో రాయిని ప్రతిష్టించి పూజిస్తారు. వివాహాల సందర్భాలలో, ఆడపిల్ల ఊరు దాటి వెళ్లేటప్పుడు, ఆ ఊరికి కొత్త కోడళ్లు వచ్చినప్పుడు గ్రామ ప్రవేశద్వారంలో బొడ్రాయికి పూజలు చేస్తారు. బొడ్రాయి దగ్గర పూజారులుగా గ్రామానికి సంబంధించిన బోయలు గానీ, తలారి ఉంటారు. అలాగే గ్రామ దేవరలు చేసే సందర్భంలో ఊరి వాకిలి బొడ్రాయి ముందే జంతువులను గ్రామ దేవతలకు బలి ఇస్తుంటారు. ఇప్పుడు గ్రామాలు విస్తరించడం, భిన్న మతాలు ప్రవేశించడం వల్ల బొడ్రాయిలు కనిపించడలేదు.