Huzurabad By Election: రేవంత్‌కు మొదటి లిట్మస్ టెస్ట్ హుజూరాబాద్..!
పీసీసీ చీఫ్‌గా తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి. గత నలభై ఏళ్లలో ఒక్క సారి కూడా హూజారాబాద్‌లో గెలవని కాంగ్రెస్ పార్టీ.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా రేవంత్ రెడ్డికి మొదటి సవాల్ హుజూరాబాద్ ఉపఎన్నికే. పీసీసీ చీఫ్ పదవిని పొందడానికి ఎంతో శ్రమించిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించడానికి అంతకంటే ఎక్కువ రాజకీయ నైపుణ్యతను ప్రదర్శించాల్సి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిన్నామొన్నటి వరకు గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఉన్న నేతలంతా స్వల్ప కాలిక ప్రయోజనాల కోసం అధికార పార్టీలతో కుమ్మక్కు కావడం... గ్రూపు తగాదాలతో సొంత ప్రయోజనాలు చూసుకోవడంతో... మెల్లగా ప్రజల్లోనూ విశ్వాసం కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదేమో అన్న ఆలోచనకు వచ్చారు. కొన్నాళ్లుగా ఏ ఎన్నిక జరిగినా ఫలితాలు అదే విషయాన్ని నిరూపించాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయమే అన్న అభిప్రాయాన్ని మార్చాల్సి ఉంది.
40 ఏళ్లలో ఒక్కసారీ హుజూరాబాద్‌లో గెలవని కాంగ్రెస్..!
హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి రేసులో లేదు. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస వర్సెస్ బీజేపీ అనే పరిస్థితి ఏర్పడిపోయింది. అంతకు ముందు కమలాపూర్‌లో కానీ ఇప్పటి హూజూరాబాద్‌లో కానీ కాంగ్రెస్ గెలిచి దశాబ్దాలు దాటిపోయింది. 1978లో దుగ్గిరాల వెంకట్రావు..చివరి సారిగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మళ్లీ అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదు. అదే దుగ్గిరాల వెంకట్రావు 1985లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా మారగా..ఆ తర్వాత టీఆర్ఎస్ పెట్టని కోటగా నియోజకవర్గం మారిపోయింది. టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తూ వచ్చిన ఈటల రాజేందర్‌కూ ఎప్పుడూ 40వేల మెజారిటీ తగ్గలేదు. అయితే అక్కడ కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం కాలేదు. ఎప్పుడూ రెండో స్థానంలో ఉంటూనే వచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఆయకు అరవై వేల ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరిపోయారు.
దామోదర రాజనర్సింహను ముందు పెట్టి దళిత వ్యూహం..!
దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి హుజూరాబాద్‌లో ఒకటి నుంచి ప్రారంభించాల్సి ఉంది. అంతర్గతంగా నివేదికలు తెప్పించుకున్నారు. కేసీఆర్ దళిత ఫార్ములా ప్రయోగిస్తూండటంతో ... దీటుగా ఎదుర్కొనే వ్యూహాన్ని రేవంత్ అమలు చేయడం ప్రారంభించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలకు కాంగ్రెస్ ఇంచార్జ్‌గా దామోదర రాజనర్సింహను నియమించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ రూపకర్త దామోదర రాజనర్సింహనే. ఆ విషయలో ఆయనకు గుర్తింపు ఉంది. ఈ సబ్ ప్లాన్ వల్ల... దళితుల నిధులు పక్కదారి పట్టకుండా నేరుగా దళిత వర్గాలకే అందుతున్నాయి. దీని వల్ల దళిత వర్గాల్లో దామోదరకు ఆదరణ ఉంటుందని రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు. ప్రస్తుతానికి హుజూరాబాద్‌కు దామోదరనే ఇంచార్జ్ గా పెట్టినా... చివరికి పరిస్థితిని బట్టి ఆయననే అభ్యర్థిగా ఖరారు చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం... కాంగ్రెస్ వర్గాల్లో ఏర్పడింది.
గట్టి పోటీ ఇచ్చినా రేవంత్‌కు నైతిక విజయమే..!
అలాగే దళిత గిరిజనుల్ని ఏకం చేసేందుకు కార్యక్రమాలను రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల వల్ల.. దళితులు టీఆర్ఎస్‌కు అనుకూలంగా మారకుండా చేయగలిగితే.. కాంగ్రెస్ పార్టీకి కూడా ఛాన్స్ ఉంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోయినా.. కనీసం గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితికి తీసుకెళ్లగలిగితేనే.. రేవంత్ రెడ్డి మొదటి అడుగులో తనదైన విజయం సాధించినట్లుగా భావించవచ్చు. దీని కోసమే రేవంత్ రెడ్డి తన ప్రయత్నాలను జోరుగా చేస్తున్నారు.