BRS Kumaraswamy : కర్ణాటకలో కేసీఆర్ స్ఫూర్తితోనే పథకాలు - బీఆర్ఎస్‌తో కలిసే ఉన్నానన్న కుమారస్వామి !
బీఆర్ఎస్‌తో కలిసే ఉన్నానని కుమారస్వామి ప్రకటించారు. దేవెగౌడ తర్వాత అంతటి మార్గదర్శి సీఎం కేసీఆరేనని కుమారస్వామి చెబుతున్నారు.
BRS Kumaraswamy : భారత్ రాష్ట్ర సమితితో కర్ణాటకకు చెందిన కుమారస్వామి తెగతెంపులు చేసుకున్నారని అందుకే ఖమ్మం సభకు హాజరు కాలేదని జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ వచ్చింది. స్వయంగా కుమారస్వామి ఈ అంశంపై స్పందించారు. తన తండ్రి దేవెగౌడ తర్వాత అంతటి మార్గదర్శి సీఎం కేసీఆరేనని చెప్పారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి. కేసీఆర్ ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కుమారస్వామి హాజరుకాకపోవడం అందరిలో అనేక అనుమానాలను రేకెత్తించింది. ఇద్దరి మధ్య ఏదో గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా కుమారస్వామి స్పందిస్తూ ఊహాగానాలను కొట్టిపారేశారు. తాను పాదయాత్ర చేస్తున్నందునే హాజరు కాలేదని ఆయన చెబుతున్నారు.
పాదయాత్ర లో ఉన్నందునే ఖమ్మం సభకు రాలేదన్న కుమారస్వామి
కర్ణాటక రాయచూర్ లో జరిగిన పంచరత్న యాత్రలో ప్రస్తుతం కుమారస్వామి పాల్గొంటున్నారు. ఈ యాత్రలో నారాయణపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతో కలిసి కుమారస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పథకంతో తెలంగాణలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు లభిస్తోందన్నారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ స్ఫూర్తితో పథకాలను అమలు చేస్తామని తెలిపారు.
జేడీఎస్‌తో కలిసి కర్ణాటకలో అధికారం పొందాలనే లక్ష్యంతో కేసీఆర్
కుమారస్వామి కుమారుడు .. సినీ హీరో అయిన నిఖిల్ గౌడ కూడా ప్రగతి భవన్‌లో జరిగిన విందు భేటీలో పాల్గొన్నారు. కేటీఆర్ స్వయంగా ఆయనకు టిఫిన్ వడ్డించారు. జేడీఎస్ ప్రతీ సారి కీలక పార్టీగా ఉంటోంది కానీ అధికారాన్ని పొందలేకపోతోంది. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేసి.. మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ మధ్యలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించడంతో అధికారాన్ని కోల్పోయింది. కుమారస్వామి ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఆ తర్వాత కూడా జేడీఎస్ నుంచి పలువురు నాయకులు నిష్క్రమించారు. అదే సమయంలో దేవేగౌడ కుటుంబం నుంచి రాజకీయ ప్రాతినిధ్యం పెరిగిపోయింది. కుటుంబ పార్టీ అనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి.
కేసీఆర్‌తో కలిసి దేశమంతా తిరుగుతామన్న కుమారస్వామి
తెలంగాణ పథకాలు బాగున్నాయన్న ఆయన.. దేశమంతా ఇలాంటి పథకాలు అమలు కావాలన్నారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, బీఆర్‌ఎస్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నానన్నారు. మొత్తంగా బీఆర్ఎస్ ఫస్ట్ టార్గెట్‌గా కేసీఆర్ కర్ణాటకను ఫిక్స్ చేసుకున్నారు. అక్కడ ఆయనకు బలమన ప్రాంతీయ పార్టీ మద్దతు లభించింది. ఇక బీఆర్ఎస్ కర్ణాటకలో అడుగు పెట్టినట్లే. ఆర్థిక వనరులను టీఆర్ఎస్ నేత సమకూరిస్తే.. కర్ణాటకలో సీట్ల గెలుపును జేడీఎస్ తమ భుజాల మీద వేసుకునే అవకాశం ఉంది.
ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్స్ సభకు హాజరు కానున్న కుమారస్వామి
ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభం రోజున బీఆర్ఎస్ పార్టీ భారీ సభను నిర్వహించనుంది. ఈ సభకు తమిళనాడు, ఝార్ఖండ్ సీఎంలు స్టాలిన్, హేమంత్ సొరేన్ లతో పాటు మరికొందరు నేతలు హాజరుకానున్నారు. ఈ సభకు కుమారస్వామి, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితర నేతలు హాజరుకానున్నారు.