KTR No Arrest: స్థానిక సంస్థల ఎన్నికల కోసమే డైవర్షన్ - ఏసీబీ విచారణ తర్వాత కేటీఆర్ ఆరోపణలు
KTR: స్థానిక సంస్థల ఎన్నికల కోసమే విచారణ పేరుతో డైవర్షన్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఏడు గంటాల పాటు ఏసీబీ అధికారులు ప్రశ్నించిన తర్వాత తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.

KTR was questioned by ACB officials: స్థానిక సంస్థలకు వెళ్లేందుకే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఏసీబీ ఆఫీసులో విచారణ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నాలుగు గోడల మధ్య ఎందుకు నాలుగు కోట్ల మంది ముందు లైడిటెక్టర్ సవాల్ విసిరితే రేవంత్ పారిపోయాడని కేటీఆర్ విమర్శించారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదన్నారు. తొమ్మిది గంటల పాటు అడిగిందే అడిగారన్నారు. ఫార్ములా ఈ రేసు వేరే ప్రాంతానికి పోవద్దనే డబ్బులు చెల్లించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు కాబట్టి తమనూ జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం పెడితే చర్చిద్దామంటే ముందుకు రావడం లేదన్నారు.
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. దాదాపుగా 7 గంటల పాటు కేటీఆర్ను ప్రశ్నించారు ఏసీీబ అధికారులు. విచారణ తర్వాత మళ్లీ పిలుస్తామని చెప్పి పంపేశారు. అక్కనుంటి కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. ఉదయం కేటీఆర్ విచారణకు వెళ్లినప్పటి నుంచి అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఏడు గంటల పాటు విచారణ జరిపి సాయంత్రం ఆరు గంటల సమయంలో పంపేశారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది.
విచారణలో కేటీఆర్ సెల్ ఫోన్ గురించి పోలీసులు వాకబు చేశారు. ఇవాళ తాను విచారణకు ఫోన్ తీసుకు రాలేదని కేటీఆర్ సమాధానం చెప్పారు. ఫార్ములా ఈ రేసు జరిగినప్పుడు ఉపయోగించిన ఫోన్ ను స్వాధీనం చేయాలని పోలీసులు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. పద్దెనిమిదో తేదీలోపు ఫోన్లు సబ్ మిట్ చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది.
అరెస్టు చేస్తారని కేటీఆర్ కూడా అనుమానించారు. ఉదయం కేటీఆర్ ఏసీబీ ఆఫీసుకు వెళ్లేటప్పుడు తనను అరెస్టు చేస్తారన్నట్లుగా మాట్లాడారు. ఒక సారికాదు వంద సార్లు అరెస్టు అవుతామన్నారు. కేటీఆర్‌ను అరెస్టు చేస్తే.. పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడానికి కార్యకర్తలు కూడా వచ్చారు. తెలంగాణ భవన్ వద్ద పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలెవరూ ఆ చుట్టుపక్కల ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. టీస్టాళ్లు, హోటళ్లలో ఉండే వారిని పంపేశారు. అనుమానాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదంతా కేటీఆర్ అరెస్టుకు సన్నాహాలేనని అనుకున్నారు. కానీ ఏసీబీ అధికారులు మాత్రం అలాంటి చాన్స్ తీసుకోలేదు. కేటీఆర్ పదే పదే కావాలని అరెస్టు అయి సానుభూతి తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. కేబినెట్ సమావేశానికి ముందు సీతక్క ఇదే విషయం చెప్పారు. జైలుకు పోవాలనే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చివరికి కేటీఆర్ అరెస్టు జరగలేదు.





















