KTR : మల్కాజిగిరిలో బీజేపీతోనే పోటీ - కాంగ్రెస్ అభ్యర్థి డమ్మీ - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Telangana : కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గ సమీక్షా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
KTR Comments : మల్కాజ్‌గిరి పార్లమెంట్‌లో మనకు పోటీ కాంగ్రెస్‌తో కాదు.. బీజేపీతోనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను మళ్లీ జరగనివ్వొద్దని కేటీఆర్ సూచించారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మల్కాజ్‌రి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మేడ్చల్ అంటనే మాస్.. మల్లన్న మరీ మాస్ అన్నారు. మల్లా రెడ్డి మేడ్చల్‌కే పరిమితం కాకుండా.. రాష్ట్రమంతా తిరగాలి. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆయన గొంతు అవసరం అని కేటీఆర్ పేర్కొన్నారు.
మల్లారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించి ఎన్నో రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన నియోజకవర్గంలో 10 మున్సిపాలిటీలు ఉంటే అన్నింటికి అన్ని గెలిచారు. అయితే గెలిచింది మల్లారెడ్డి అంటున్నారు కానీ గెలిపించింది మీరు. మీరు కష్టపడితేనే 10కి 10 గెలిచాం. ఎంతో కమిట్ మెంట్ ఉంటేనే ఇది సాధ్యమైంది. మేడ్చల్‌లో బీఆర్ఎస్ బలమేందో తెలిసిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సామాజిక సేవలు చేస్తూ మల్కాజ్‌గిరి పార్లమెంట్‌లోని ప్రజలతో కలిసి మెలిసి ఉన్నారు. బ్రహ్మాండంగా ఆయనకు సేవాగుణం ఉంది. వారిని కేసీఆర్ పిలిచి ఆశీర్వదించి అభ్యర్థిగా ప్రకటించారు. మనకు కాంగ్రెస్‌తో పోటీ లేదు. కేవలం డమ్మీ అభ్యర్థిని మన ప్రాంతంతో సంబంధం లేని వ్యక్తిని నిలబెట్టారు. చేవెళ్లలో రిజెక్ట్ చేస్తే ఇక్కడ బలవంతంగా నిలబెట్టారు. ఇక్కడ మనకు పోటీ బీజేపీతోనే అని కేటీఆర్ స్పష్టం చేశారు.
రోడ్ల అభవృద్ధికి కోసం పదేళ్లు కంటోన్మెంట్ లో భూములు కావాలని అడిగితే పట్టించుకోలేదు .. తెలుగు అధికారి గిరిధర్ అనే వ్యక్తి ద్వారా ఆ ఫైల్ కదిలిందన్నారు. మందికి పుట్టిన బిడ్డలను నా బిడ్డలని చెప్పుకునే తత్వం రేవంత్ రెడ్డిదని మండిపడ్డారు. మొన్నటి దాకా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అంటివి. ఇప్పుడు గత గవర్నమెంట్ బీజేపీతో లొల్లి పెట్టుకుందంటున్నావని విమర్శించారు. కాంగ్రెసోళ్లు పచ్చి మోసగాళ్లు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన ఉద్యోగాలు ఇయ్యలేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకుంటే విద్యార్థులు చైతన్యవంతులు మీ అంతు చూస్తారన్నారు. రేవంత్ రెడ్డి గానీ, బీజేపీ గానీ మల్కాజ్ గిరికి చేసింది గుండుసున్నా. ఒక్క కొత్త మెడికల్ కాలేజ్, నవోదయ పాఠశాల, కొత్త కాలేజ్ కూడా తీసుకురాలేదన్నారు.
మోడీ దేవుడని బండి సంజయ్ అంటాడు. అసలు మోడీ ఎవరికీ దేవుడని కేటీఆర్ ప్రశ్నించారు. రేట్లు పెంచినందుకా, మహిళలకు దేవుడా, ఏం అభివృద్ధి చేసిండని దేవుడని ప్రశఅనించారు. ఏం మొఖం పెట్టుకొని బీజేపీ ఓట్లు అడుగతదో ఈటల చెప్పాలన్నారు. మల్కాజ్ గిరిలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా బీజేపీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇక్కడ కాంగ్రెస్ కు ఓటేస్తే...బీజేపీకి ఓటేసినట్లేనన్నారు. రాహుల్ గాంధీ ఏమో చౌకిదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమో మోడీ హమారా బడే భాయ్ అంటాడని విమర్శించారు. రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కాం ఏం లేదంటాడు. కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయమని అంటాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కవితమ్మ అరెస్ట్ కరెక్టే అంటాడని విమర్శించారు. ప్రభుత్వాన్ని పడగొడితే మానవబాంబు అవుతా అంటాడు. ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం మాకు లేదు నీ పక్కనే నల్గొండ, ఖమ్మం మానవబాంబులే నిన్ను కూలగొడుతాయని జోస్యం చెప్పారు.
మనం చేసిన మంచి పనులను చెప్పుకోవాల్సినంత చెప్పుకోలేదని అందుకే ఓడిపోయామని కేటీఆర్ అన్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు జరగకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో సెక్యులర్ పార్టీ ఉందంటే అది బీఆర్ఎస్ మాత్రమేన్నారు. మనమే అభ్యర్థి అన్నట్లుగా కష్టపడి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించుకుందామని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.