KTR: నాగార్జునసాగర్, శ్రీశైలంలోనూ లీకులొచ్చాయి, మేము రాజకీయం చేయలేదే - కేటీఆర్ కామెంట్స్
Brs Leaders: మేడిగడ్డ ప్రాజెక్టును ఇవాళ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా లీకేజీలను పరిశీలించారు. ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు.
Medigadda Barrage: మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిష్ఫలమైందని దుష్ప్రచారం చేస్తున్నారని, కాళేశ్వరం ద్వారా రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఛలో మేడిగడ్డ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నేతలు ఇవాళ మేడిగడ్డను సందర్శించారు. అనంతరం మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజీకి చేరుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తమపై ఏదైనా కోపం, రాజకీయం వైరం ఉంటే తీర్చుకోండి.. కానీ మేడిగడ్డకు మరమ్మత్తులు చేయండి అని సూచించారు. మేడిగడ్డకు మరమ్మత్తులు చేయవచ్చని నిపుణులు చెప్పారని, అధికారులు, నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు.
ప్రజలకు వివరించేందుకే ఛలో మేడిగడ్డ
కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలకు వివరించేందుకే ఛలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపట్టామని, నల్లగొండ సభలో కేసీఆర్ చెప్పినట్టుగానే ఈ రోజు వచ్చి ప్రజలకు కాంగ్రెస్ అసత్య ప్రచారాలను వివరిస్తున్నామని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించి, అసలు నిజాలను ప్రజలకు చెప్పే క్రమంలో ఈరోజు పర్యటన మొదటి అడుగు మాత్రమేనన్నారు. దీని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మిగిలిన అన్ని ప్రాజెక్టులను, రిజర్వాయర్లను, కెనాల్స్, టన్నెళ్లు, కాలువలను ప్రజలకు వివరించేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తామని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంలోని ఒక్క మేడిగడ్డలో మూడు పిల్లర్లలో వచ్చిన సమస్యను పట్టుకొని లక్ష కోట్లు వృధా అన్న తీరుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు.
పంటలు ఎండవద్దు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లే దిక్కు
'ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచారాన్ని తిప్పి కొడతాం. రాబోయే రోజుల్లో రైతన్నల పంటలు ఎండవద్దు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళే దిక్కు. మాతోపాటు వచ్చిన ఇంజనీరింగ్ నిపుణులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించారు. వరదలు వచ్చేలోగా మేడిగడ్డలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. వరదలు వచ్చేలోగా మేడిగడ్డను సురక్షితమైన స్థితికి తీసుకురావాలి. మేడిగడ్డ విషయంలో బాధ్యులుపై చర్యలు తీసుకోవాలి. సాగునీరు లేక ఇప్పటికే కరీంనగర్‌లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇతర జిల్లాల్లోనూ పంటలు ఎండిపోయే పరిస్థితులు వచ్చాయి. రైతులు, రాష్ట్రంపై పగ పట్టవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నా. 1.6 కిలోమీటర్ల బ్యారేజీలో 50 మీటర్ల ప్రాంతంలో సమస్య ఉంది. ఇలాంటివి గతంలో ఎప్పుడూ జరగలేదన్నట్లు మాట్లాడటం సరికాదు. కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, గూండ్లవాడు రెండుసార్లు కొట్టుకుపోయాయి. నాగార్జున సాగర్, శ్రీశైలంలోనూ లీకులు వచ్చాయి. వాటిని మేం రాజకీయం చేయలేదు. నిపుణుల సలహాలు తీసుకుని మేడిగడ్డను పునరుద్దరించాలని కోరుతున్నా' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అటు నీటి పారుదల నిపుణుడు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డలో వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. బ్యారేజ్ ఉపయోగపడాలంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలని, మరమ్మతులు చేపట్టకుంటే వదిలేస్తే మరింత దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించారు. లీకేజీలను అలాగా వదిలేస్తే బ్యారేజీకి ముప్పు వాటిల్లుతుందని అన్నారు. మరమ్మతులు నిర్వహించి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.