Medigadda Project: కాంగ్రెస్ కుట్రతో ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగాయి!: కేటీఆర్
KTR News: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయేలా కాంగ్రెస్ నేతల కుట్రలు ఏమైనా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోందన్నారు
Medigadda Barrage: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కాంగ్రెస్ కుట్ర ఉందనే అనుమానులు ఉన్నాయంటూ కీలక ఆరోపణలు చేశారు. మూడు పిల్లర్లు కుంగటం అంటే అనుమానం వస్తోందని అన్నారు. నిర్మాణంలో లోపం కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే మొత్తం ప్రాజెక్ట్‌కు జరగాలి అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చెక్కుచెదరని బ్యారేజ్ ఎన్నికల ముందు అలా ఎందుకు అవుతుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే బ్యారేజ్ పరిస్థితి ఎందుకు అలా అవుతుంది? మున్ముందు బ్యారేజీకి ఏం జరిగినా అది ఈ ప్రభుత్వ కుట్ర ఫలితమే అని భావించాల్సి ఉంటుందన్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి ఏం జరిగినా మరమత్తులు చేయొద్దని ఫిక్స్ అయినట్లున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో చిట్ చాట్లో పాల్గొన్నారు.
కాళేశ్వరం పనికి రాదన్నారు
కేవలం అహం అడ్డొచ్చే బ్యారేజీకి మరమత్తులు చేయడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ పని అయిపోయిందన్నారని, కాళేశ్వరం పనికి రాదన్నారని గుర్తుచేశారు. కానీ పంపులు మంచిగానే పని చేస్తున్నాయని తెలిపారు. కన్నెపల్లి నుంచి రోజు మూడు టీఎంసీలు పంప్ చేయవచ్చని చెప్పారు. ఎన్డీఎస్ఏ నివేదిక పేరు చెబుతూ పంప్ చేయబోమని ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే యత్నం చేస్తోందని ఆరోపించారు. అసలు ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలనుకుని విఫలమయ్యారు. నిన్న మేము మేడి గడ్డ వెళ్ళినపుడు పది లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా మేడి గడ్డ బారేజ్ తట్టుకుని నిలబడిందన్నారు.
ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు అది ఎన్డీయే రిపోర్టు
కాంగ్రెస్, బీజేపీ లు ఏ విషయం లో విభేదించినా కాళేశ్వరం మీద ఓకే వైఖరి తో ఉన్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా నడుచుకుంటారంటున్నారు .. కానీ బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటారు. పోలవరం కాఫర్ డాం కొట్టుకుపోయినపుడు ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎక్కడకి పోయింది? 90 టీఎంసీ ల నీళ్లు గోదావరి లో వృధాగా పోతున్నాయి. అంటే ఆ నీటి మొత్తం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తో సమానం
భేషజాలకు పోకండి
ఎల్లంపల్లిలో 16 టీఎంసీ ల నీళ్లే ఉన్నాయని కేటీఆర్ అన్నారు. పద్నాలుగు టీఎంసీ ల నీళ్లు హైదరాబాద్ కు నిల్వ ఉంచాలి. రెండు టీఎంసీ ల నీళ్లు లిఫ్ట్ చేశాకే ఆపే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఎల్లంపల్లి నీళ్లు మిడ్ మానేరు ,మిగతా రిజర్వాయర్లు నింపడానికి సరిపోవు. కన్నె పల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదన్నారు. ఇపుడు ఏ ఎన్నికలు లేవు .. దీనిపై రాజకీయం చేయవద్దంటూ సూచించారు.
కాళేశ్వరం అనేది కరువుకు ఇన్సూరెన్స్
ప్రస్తుతం రాష్ట్రంలో 40శాతం వర్ష పాతం లోటు ఉంది. లిఫ్ట్ లకు విద్యుత్ ఖర్చు అయితే అవుతుంది ..రైతులకు నీళ్లు ఇవ్వడం కంటే ఆ ఖర్చు ముఖ్యమా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గల్ఫ్ లో తాగు నీళ్ల కోసం ఖర్చు ఎంతయినా పెడతారు. కాళేశ్వరం బహుళ ప్రయోజనాలున్న ప్రాజెక్ట్ అని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం కు డబ్బులవుతున్నాయని బాధ పడుతున్నవారు, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కు లక్షా 50 వేల కోట్ల రూపాయలు అవసరమవుతుందంటున్నారు. అది ఎవరికి లాభం, అవినీతి కోసమే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టా ? అని నిలదీశారు. నీళ్లున్నపుడే ఖాళీ ప్రాజెక్టులు నింపి పెట్టుకోవాలి. ఆగస్టు 2 తర్వాత కేసీఆర్ తో చర్చించి కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్ల విడుదల కోసం కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ చెప్పారు.
ఇంజనీర్లు చెప్పినా వినరా
బ్యారేజీ గేట్లు తెరచి ఉన్నా నీళ్లను లిఫ్ట్ చేసుకోవచ్చని ఇంజినీర్లు చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ లో నీళ్లు లిఫ్ట్ చేయాలనీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుంది. అది ఏ మాత్రం సరికాదన్నారు. తాము కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టినా సరిగా ప్రచారం చేసుకోలేక పోయామని కేటీఆర్ వాపోయారు. చేసింది సరిగా చెప్పుకోలేకే ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సీఎం ప్రతిపక్షనేత అనే మూడ్ లోనే ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎల్ అండ్ టీ గురించి సీఎం అసెంబ్లీ లో మాట్లాడిన తీరు బాగా లేదు. సీఎం అలా మాట్లాడితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి ? అని కేటీఆర్ ప్రశ్నించారు.