Telangana News: చార్జీలు లేకుండా LRSను అమలు చేయండి- సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
Telangana CM రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలని కోరారు.
KTR letter to Revanth for LRS: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కి లేఖ రాశారు. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్‌ఆర్‌ఎస్ (LRS)ను అమలు చేయాలని కోరారు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు చెప్పిన మాటలు, హామీలను దృష్టిలో ఉంచుకొని ఎల్ఆర్ఎస్‌ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదా... గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు, ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ కోరాలంటూ లేఖ రాశారు కేటీఆర్.
ప్రజలను ఎందుకు దోపిడీ చేస్తున్నారో..!
ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న రేవంత్‌రెడ్డి... అదే ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ఇప్పుడు ప్రజలను ఎందుకు దోపిడీ చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల డిమాండ్‌ను తమ నిరసన కార్యక్రమాల ద్వారా వినతిపత్రాల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అందించామన్నారు. ప్రజల ఆకాంక్ష, డిమాండ్ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా అమలు చేయాల్సిందే అన్నారు కేటీఆర్. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు, మాట్లాడిన మాటలను కూడా తన లేఖలో ప్రస్తావించిన కేటీఆర్.
మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి (Veernapally) మండలంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం (BRS Meeting) జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాగానే వీర్నపల్లిని మండలంగా మార్చామని చెప్పారు. కానీ... కాంగ్రెస్ పార్టీ కల్లబోల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను లెక్కబెడితే 420 వచ్చాయని... 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతుంటే... ఇప్పుడే సీఎం కుర్చీలో కూర్చున్న ఆయన... అప్పుడే ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారని అంటున్నారని చెప్పారు.
పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా... కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ మళ్లీ కరువు ముంచుకొస్తోందని.. ఈ కరువు కాలం తెచ్చిన కరువు కాదని... కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఒక టీఎంసీ నీళ్లు అంటే హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో ఉన్న నీళ్ళతో సమానమని చెప్పారు. కేసిఆర్ ఉంటే ఏదో ఒక రకంగా నీళ్లు తెచ్చేవారని... తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. కేసిఆర్ ఉంటే కాళేశ్వరం వీలైనంత తొందరగా రిపేర్ చేసి రైతులకు నీళ్లు ఇచ్చుండేవారని అన్నారు. రాజకీయాలు పక్కనపెట్టి దమ్ముంటే నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు కేటీఆర్. కేసీఆర్ ఉన్నప్పుడు టింగ్ టింగ్ మని రైతుబంధు పడేదని కూడా గుర్తుచేశారాయన. మోసపోతే గోస పాడతారని కేసీఆర్ ముందే చెప్పిరాని.. ఇప్పుడు అదే జరుగుతోందన్నారు.
బీజేపీ (BJP) సీనియర్ నేత బండి సంజయ్ (Bandi sanjay)పై కూడా విమర్శలు గుప్పించారు కేటీఆర్. బండి సంజయ్‌కి బుద్ధి చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో... తన కంటే వినోద్ కుమార్‌కు ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని ప్రజలకు కోరారు. బండి సంజయ్ వీర్ణపల్లికి ఒక్క రూపాయన్నా తెచ్చారా అని ప్రశ్నించారు. అంత మాత్రానికి... బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని అడిగారు. పార్లమెంట్‌లో మాట్లాడాలంటే బండి సంజయ్‌కి హిందీ, ఇంగ్లీష్ రెండు రావలని.. అలాంటప్పుడు ఆయన లోక్‌సభకు వెళ్లి ఏం మాట్లాడతారు..? ఎలా మాట్లాడుతారని నిలదీశారు. పార్లమెంట్‌లో బండి సంజయ్ హాజరు 5 శాతం మాత్రమే అన్నారు కేటీఆర్. బీజేపీ హిందూ దేవుళ్ల పేరుతో ఓట్ల రాజకీయం చేస్తోందని మండిపడ్డారాయన. గతంలో వినోద్ కుమార్ (Vinod Kumar) ఎంపీగా ఉన్నపుడు వీర్ణపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేశారని చెప్పారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు గట్టిగా నిలదీయాలన్నారు కేటీఆర్. రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారని... ఆ హామీని అమలు చేయమని నిలదీసి అడగాలన్నారు. ఎలక్షన్ కోడ్ రాకముందే రైతులకు ఇచ్చే బోనన్‌పై జీవో ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. ఈనెల 12న కరీంనగర్‌లో నిర్వహించబోతున్న కథనభేరీ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. కథనభేరి సభను విజయవంతం చేయాలని కోరారు కేటీఆర్.