KTR Meets Ponnala: బీఆర్ఎస్ లో చేరనున్న మాజీ మంత్రి పొన్నాల! రేపు కేసీఆర్ తో కీలక భేటీ
Ponnala likely to join BRS party: కాంగ్రెను వీడిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.
Ponnala Lakshmaiah likely to join BRS party:
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెను వీడిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్ళి ఆయనతో చర్చలు జరిపారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి హైదరాబాద్‌లోని పొన్నాల నివాసానికి వెళ్లారు కేటీఆర్. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలోకి పొన్నాలను ఆహ్వానించిన మంత్రి కేటీఆర్. అందుకు పొన్నాల సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పొన్నాల నివాసం వద్దకు ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. జనగామ గడ్డ.. పొన్నాల అడ్డా అంటూ ఆయన మద్దతుదారులు నినాదాలు చేశారు.
రేపు కేసీఆర్ ను కలవనున్న పొన్నాల..
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. అక్టోబర్ 16న జనగాంలో జరగబోయే సభలో పొన్నాల బీఆర్ఎస్ లో చేరతారని తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పొన్నాల లక్ష్మయ్యకు పార్టీలో సముచిత గౌరవం, ప్రాధాన్యం ఇస్తామని సీఎం కేసీఆర్ అన్నారని పొన్నాలతో భేటీ అనంతరం కేటీఆర్ చెప్పారు. అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుని నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో ఇంజినీర్‌గా పనిచేసిన వ్యక్తి పొన్నాల అని తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆహ్వానం మేరకు కాంగ్రెస్ లో చేరిన కొన్ని దశాబ్దాల నుంచి సేవ చేశారని గుర్తుచేశారు.
‘కేశవరావు, డీఎస్ లాంటి నేతలను ఆహ్వానించి పార్టీలో వారికి సముచిత స్థానం కల్పించారు కేసీఆర్. ఇప్పుడు పొన్నాలను సైతం పార్టీలో చేరాలని కేసీఆర్ సూచన మేరకు పొన్నాలను ఆహ్వానించాం. పొన్నాల లాంటి కీలక నేత, అనుభవం ఉన్న నేతపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దారుణం. అలాంటి మాటలను ప్రజలతో పాటు మిగతా పార్టీలు చీదరించుకుంటున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేత.. గతంలో బీజేపీ ఆరెఎస్సెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. రేపు ఆయన ఏ పార్టీలో చేరతారో తెలియదు. అలాంటి వ్యక్తి పొన్నాల మీద వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. దిగజారుడు సంస్కృతిని మార్చుకోవాలి. ఒకమాట అనేటప్పుడు అవతలివాళ్లు మనల్ని 10 రెట్లు అనవచ్చు. ఆఖరికి చనిపోయే ముందు పార్టీ మారుతున్నారు అని నీచమైన, చిల్లర మాటలు మాట్లాడటం బాధాకరం’ అన్నారు మంత్రి కేటీఆర్.
‘డబ్బు సంచులకు టికెట్లు అమ్ముకుంటున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. అలాంటి నేతకు ఎన్నికల్లో ఫలితాలతో బుద్ధి చెబుతాం. అనుభవం ఉన్న పొన్నాలను కాంగ్రెస్ ఆధరించలేదు. కానీ కేసీఆర్ మాజీ మంత్రి పొన్నాలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించాలని సూచించారు. ఆయన సూచన మేరకు పొన్నాల నివాసానికి వచ్చి పార్టీలో చేరాలని ఆహ్వానించాం. జనగామ టికెట్ ఇస్తామా లేదా అనేది రేపు కేసీఆర్, పొన్నాల భేటీ తరువాత తెలుస్తుంది. అప్పటివరకూ ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయకూడదని’ మంత్రి కేటీఆర్ కోరారు. నిన్న అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగానే బీఆర్ఎస్ లోకి పొన్నాలను ఆహ్వానించారు.