Congress Dues Card campaign: కాంగ్రెస్ బాకీ కార్డ్ ఉద్యమం చేపట్టిన బీఆర్ఎస్- ప్రజల చేతుల్లోకి పాశుపతాస్త్రాలు: కేటీఆర్
BRS working present KTR | హామీల పేరుతో కాంగ్రెస్ మోసాలు చేసిందని తెలంగాణ ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బాకీ కార్డ్ ఉద్యమం చేపట్టింది.

BRS Campaign against Congress Govt | హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు (Congress 6 Guarantees)ను అమలు చేయకుండా వాటిని తుంగలో తొక్కిందంటూ కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసింది. ఈ క్రమంలో "కాంగ్రెస్ బాకీ కార్డు" (Congress Dues Card) ఉద్యమం ప్రారంభించామని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ భవన్‌లో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, తదితర ప్రముఖులతో కలిసి ప్రారంభించారు.
ప్రజల చేతుల్లోకి బీఆర్ఎస్ పాశుపతాస్త్రాలు
ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన మోసాలు నేడు ప్రజల చేతిలో పాశుపతాస్త్రాలుగా మారాయన్నారు. తెలంగాణ ప్రజలు రాబోయే పంచాయతీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే ఈ 'బాకీ కార్డు' ఉద్యమానికి కారణం అని కేటీఆర్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ విమర్శలు
కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించింది. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి, నేడు హామీలను పక్కన పెట్టిందని, ప్రజా శ్రేయస్సును గాలికొదిలేసిందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ చెప్పినట్లుగా 'మోసపోతే గోస పడతాం' అన్న మాటలు తెలంగాణలో ఇప్పుడు నిజమయ్యాయి అన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వ మొదటి కేబినేట్ సమావేశంలో హామీలకు చట్టబద్ధత ఇవ్వాలని చెప్పినా, ఇప్పటి వరకు వాటి అమలులో ఎలాంటి పురోగతి లేదన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ హామీల బాకీ:
- రైతులకు ₹15,000, ₹2 లక్షల రుణమాఫీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు వాటిని అమలు కాలేదు.
- నిరుద్యోగులకు ప్రతినెలా ₹4,000. అధికారంలోకి వచ్చి 22 గడుస్తున్నా వారికిచ్చిన హామీలని నిలబెట్టుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం
- మహిళలకు ఇచ్చిన ₹2,500 వాగ్దానం నేటివరకు చూస్తే ఒక్కో మహిళకు తెలంగాణ ప్రభుత్వం 55,000 రూపాయల బకాయి పడింది.
- వృద్ధులకు ఇచ్చిన ₹4,000 పెన్షన్ హామీ 22 నెలలు పెండింగ్ అంటే వారికి సైతం ప్రభుత్వం 44,000 రూపాయల బాకీ ఉంది
- దివ్యాంగులకు ఇచ్చిన ₹6,000 హామీ ఇంకా నెరవేర్చలేదు. వారిని సైతం కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.

ఇంకా చాలా బాకీ పడింది
ఇక పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు భూములు, విద్యార్థులకు స్కూటీలు, యువతకు విద్యా భరోసా కార్డులు లాంటి ఎన్నో హామీలు నెరవేర్చలేదు. అన్నీ బాకీగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. గృహజ్యోతి పథకాన్ని కూడా సరిగా అమలు చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ నయవంచనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, ఈ 'బాకీ కార్డులను' తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో ప్రచారం చేస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయించేవరకూ ఉద్యమం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.






















