Delhi KTR BRS : తెలంగాణ ప్రజలది తప్పు లేదు - జగన్ ఓటమి ఆశ్చర్యమే - కేటీఆర్ మనసులో మాటలు
Telangana Politics : ప్రజలతో తమకు గ్యాప్ వచ్చిన మాట నిజమేననికేటీఆర్ అంగీకరించారు. ఢిల్లీలో ఉన్న మీడియా ప్రతినిధులతో ఆఫ్ ది రికార్డు మాట్లాడారు.
KTR Harish Chitchat : తెలంగాణ ప్రజలతో తమకు గ్యాప్ వచ్చిందని.. తమ వైఖరి మార్చుకోవాల్సి ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కవిత బెయిల్ విషయంపై న్యాయనిపుణులతో చర్చించేందుకు ఐదు రోజుల కిందట ఢిల్లీ వచ్చిన హరీష్ రావు, కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కొంత మంది మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల గురించి కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ప్రజలతో మాకు గ్యాప్ వచ్చింది నిజమే !
బీఆర్ఎస్ పరాజయాలకుప్రజలతో గ్యాప్ రావడమే కారణమని కేటీఆర్ అంగీకరించారు. ప్రజలది తప్పు అనడమంటే..తాము తప్పు చేస్తున్నట్లుగా అంగీకరించడమేనన్నారు. హైదారాబాద్ లో అన్ని సీట్లు గెలిచామని గుర్తు చేశారు. అభివృద్ధిని తాము చెప్పుకోలేకపోయామన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చడం వల్ల ఓడిపోయామని చాలా మంది అంటున్నారని.. కానీ దానికి ఆధారం లేదని కేటీఆర్ అన్నారు. మాకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారని కేటీఆర్ ఆరోపించారు. ఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా తెలియదని.. అభివృద్ధిలో మాతో పోటీ పడలేని వారే అహంకారం అని ప్రచారం చేశారని అన్నారు.
పవన్ వల్లే జగన్‌కు ఓటమి
ఏపీ రాజకీయాలపైనా కేటీఆర్ స్పందించారు. ఎన్నికలకు ముందు జగన్ గెలుస్తారని తమకు సమాచారం ఉందని పదే పదే కేటీఆర్, కేసీఆర్ చెప్పేవారు. ఈ అంశంపై మీడియా ప్రతినిధులతో భిన్నంగా స్పందించారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయినా 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదని.. పవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవన్నారు. ప్రతిరోజూ జనంలోకి వెళ్ళే ధర్మవరం కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యం కలిగించిందన్నారు. జగన్ ను ఓడించేందుకు షర్మిల ను ఒక వస్తువులా ఉపయోగించారని .. అంతకు మించి షర్మిలకు బలం ఏమీ లేదన్నారు.
ఫిరాయింపుల వల్ల బీఆర్ఎస్‌కు నష్టమే : హరీష్ రావు
హరీష్ రావు కూడా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఫిరాయింపుల వల్ల మాకు లాభం జరగలేదని.. మా పార్టీలు చేరిన వాళ్ళల్లో పది మంది ఓడిపోయారని గుర్తు చేసుకున్నారు. సుప్రీం తీర్పు ప్రకారం మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలనన్నారు. తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బి.ఆర్ ఎస్ ప్రభుత్వమేనన్నారు. ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారని.. రేవంత్ రెడ్డికి పాలన పై పట్టు రాలేదు..పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు మా చేతుల్లో అన్నారంటే అది వారి చేతగాని తనం అన్నట్టేనని స్పష్టం చేశారు.