Komatireddy Rajagopal Reddy: వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
Rajagopal Reddy: వైఎస్ఆర్సీలో చేరేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్తున్నారన్న ప్రచారాన్ని ఖండించారు. వైసీపీ నేత ఇంట్లో వేడుక కోసం వెళ్తున్నానన్నారు.

Komatireddy Rajagopal Reddy denies to join YSRCP: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 50 కార్లతో అనుచరులతో కలిసి ర్యాలీగా విజయవాడ వెళ్లడం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించింది. ఆయన తాడేపల్లిలో వైఎస్ జగన్ ను కలిసి ఆ పార్టీలో చేరిపోతారని.. తెలంగాణలో వైఎస్ఆర్‌సీపీకి నాయకత్వం వహిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. తాము ర్యాలీగా వెళ్తోన్నది ఓ వేడుకలో పాల్గొనడానికి అని.. ఆయన స్పష్టం చేశారు.
గుంటూరులో వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లామని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్తుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తున్నాడని పుకార్లు సృష్టిస్తున్నారని అన్నారు. తాను గుంటూరు వెళుతున్నాను అంటే మా నియోజకవర్గంలో నుంచి కూడా కొంతమంది నాయకులు నాతో వస్తా అన్నారని.. నేను మా నాయకులు కలిసి గుంటూరులో ప్రవేట్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అటు నుండి విజయవాడ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకొని వద్దామని వెళ్తున్నామని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. దానికే తాను జగన్ ని కలవడానికి వెళ్తున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
తన రాజకీయం గురించి నా భవిష్యత్తు గురించి నేను మీడియా సమావేశం పెట్టి చెబుతాను తప్ప అప్పటివరకు ఈ దుష్ప్రచారాలను నమ్మకండని తెలంగాణ సమాజాన్నికోరారు. ఇదొక్కటే కాదని తనపై మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయన్నారు. కొన్ని చానల్లో సోషల్ మీడియాలో నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తినే విధంగా తప్పుడు వార్తలు వస్తున్నాయని.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదన్న రాజగోపాల్ రెడ్డి అనే శీర్షికన నేను అనని మాటలు అన్నట్లు ప్రచురించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి మొట్టమొదటి అసెంబ్లీలో ప్రస్తావించిందే తాను అని గుర్తు చేశారు.
మంత్రి పదవి రానందుకు రేవంత్ రెడ్డి పైన, ప్రభుత్వం పైన నేను అనని మాటలను అన్నట్టు తప్పుడు కథనాలను సృష్టించి అబద్దాలను ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్సీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు కాంగ్రెస్ పార్టీ అన్న సోనియా గాంధీ ,అన్న రాహుల్ గాంధీ గారు అన్నా ఎంతో అభిమానమని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. నేను రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, పార్టీ పెడుతున్నానని తప్పుడు వార్తలు రాస్తున్నారన్నారు. కొందరు గిట్టని వ్యక్తులు నా ప్రతిష్ట దెబ్బతీయడానికి సోషల్ మీడియా ద్వారా అవాస్తవాలు పుకార్లు ప్రచారం చేస్తున్నారు .. దయచేసి తెలంగాణ సమాజం పుకార్లను నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కొన్ని సందర్భాలలో అంతర్గతంగా, బహిర్గతంగా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని కొన్ని వేదికల్లో చెప్పడం జరిగింది కానీ వేరే ఉద్దేశం లేదన్నారు.





















