Kitex Telangana Govt MoU: తెలంగాణ నుంచి అమెరికాకు దుస్తులు.. కిటెక్స్, తెలంగాణ మధ్య ఎంఓయూ
కిటెక్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కిటెక్స్ గ్రూప్ ఛైర్మన్ సాబు జాకబ్, సంస్థ సీనియర్లు పాల్గొన్నారు.
తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, రంగారెడ్డి సీతారాంపురంలో ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పరాల్ తయారీ క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు కిటెక్స్ సంస్థ ముందుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కే. తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పి. సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు ఇతర ఉన్నతాధికారులు, కిటెక్స్ గ్రూప్ ఛైర్మన్ సాబు జాకబ్, సంస్థ సీనియర్లు పాల్గొన్నారు.
కేటీఆర్ ఫోన్ చేయడంతో: సాబు జాక్
మాది చిన్నపిల్లల వస్త్రాల తయారీలో ప్రత్యేకమైన కంపెనీ. కంపెనీ నుంచి తయారైన వస్త్రాలు ధరించని పసి పిల్లలు అమెరికాలో ఉండరని చెప్పేందుకు గర్వపడుతున్నాను. కేరళ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకున్న తర్వాత తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు రావడానికి ప్రధాన కారణం మంత్రి కేటీఆర్.
మంత్రి కేటీఆర్‌ను కలిసినప్పుడు తమకు పెట్టుబడి కన్నా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కావాలని అడిగారు. ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేశాక మా వెయ్యి కోట్ల రూపాయల ప్రాథమిక పెట్టుబడిని రూ.2400 కోట్లకు పెంచాము. దీంతో 22000 ఉద్యోగాలు వస్తాయి. భవిష్యత్తులో ఇక్కడి నుంచి 30 లక్షల వస్త్రాలను అమెరికాకు ఎగుమతి చేస్తాం. భవిష్యత్తులో తెలంగాణ వస్త్రాలు ధరించని అమెరికా పిల్లలు ఉండబోరు అన్నది మా నమ్మకం.
వేల మందికి ఉపాధి: మంత్రి కేటీఆర్
కేరళ నుంచి పెట్టుబడులు ఉపసంహరించిన కిటెక్స్ సంస్థ వార్త చూసి నేరుగా జాకబ్‌తో మాట్లాడాను. రెండు మూడు రోజుల్లోనే ఆయన తెలంగాణకు వచ్చి పరిస్థితులు, వ్యాపార అనుకూలత, అవకాశాలు, ప్రభుత్వ విధానాలను పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో మొదలైన ఈ పెట్టుబడి చర్చలు నేడు రూ.2400 కోట్ల పెట్టుబడి, 22000 ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన, మరో 20,000 పైగా పరోక్ష ఉద్యోగాల కల్పతరువుగా రూపాంతరం చెందింది. కేరళలో ప్రైవేట్ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీ, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కిడ్స్ అప్పారల్ తయారీ కంపెనీ కిటెక్స్‌ను తెలంగాణకి ఆహ్వానిస్తున్నాం.
వరంగల్, రంగారెడ్డిలో కంపెనీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. ఈ కంపెనీల స్థాపన పూర్తయిన తర్వాత సుమారు మూడు లక్షల ఎకరాల్లోని తెలంగాణ పత్తిని కంపెనీ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. కంపెనీ ఉద్యోగాల కల్పనలో స్థానికులకు అధికంగా అవకాశాలు వచ్చేలా, వారికి అవసరమైన శిక్షణ కార్యకలాపాలను ప్రభుత్వం తరఫున చేపడతాం. ఈ విషయంలో స్థానిక మహిళా సంఘాలతో సమన్వయం చేసుకోవాలని జిల్లా ప్రజాప్రతినిధులకు సూచిస్తున్నాను.
సదుపాయాలు కల్పిస్తాం: మంత్రి దయాకర్
తయారీ కర్మాగారాలను నెలకొల్పేందుకు కిటెక్స్ ముందుకు రావడం సంతోషం. ఆ సంస్థకు కంపెనీకి కూడా మంచి పేరుంది. తెలంగాణలో కిటెక్స్ కంపెనీ పెట్టే పెట్టుబడులతో, ఇక్కడ ఉత్పత్తి అయ్యే బట్టలకూ మంచి గిరాకీ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ఇప్పటికే TS-iPASS కింద ఉమ్మడి భూ కేటాయింపులు జరిగాయి. అవసరమైన ప్రపంచ స్థాయి అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉంది. తెలంగాణలో పండే నాణ్యమైన పత్తికి అంతర్జాతీయంగా గిరాకీ ఉంది. త్వరగా ఈ రెండు ప్రాజెక్టులు పూర్తై మా ప్రజలకు ఉపాధి లభించాలని కోరుకుంటున్నాను.