Nelakondapalli: ప్రాచీన ఆనవాళ్లకు నెలవు నేలకొండపల్లి, పర్యాటకులను ఆకర్షిస్తోన్న బౌద్ధ స్థూపం
Nelakondapalli: ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి అనగానే భక్త రామదాసు పేరుతో పాటు బౌద్ధ స్థూపాలు గుర్తొస్తాయి. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం ఇక్కడి తవ్వకాల్లో బయటపడింది.
Nelakondapalli: ప్రాచీన ఆనవాళ్లకు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి(Nelakondapalli) కేంద్రంగా మారింది. రెండో శతాబ్దంలో కట్టిన కట్టడాలు నేటికి చెక్కుచెదరకుండా ఉన్నాయి. నేలకొండపల్లి సమీపంలో ఉన్న బౌద్ధ స్థూపాలను(Buddha Stupa)1970 పురావస్తుశాఖ అధికారులు పరిశోధనలు సాగించారు. పశ్చిమ చాళుక్యులు, తూర్పు చాళుక్యుల కాలంలో బౌద్ధమతానికి చెందిన వారు ఇక్కడ ధ్యానం చేసుకునేందుకు వీలుగా స్థూపాన్ని నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపంగా గుర్తించారు. దీంతో పాటు ఇక్కడ తవ్వకాల్లో 3వ శతాబ్ధం నాటి నాణేలు, అప్పటి నిర్మాణ శైలిని గుర్తించారు. బౌద్ధ బిక్షువులు ఇక్కడ ఆరాధన చేసుకునేందుకు వీలుగా పక్కనే చెరువును తవ్వించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.
బౌద్ధస్థూపం చుట్టూ పార్కు
పురాతన కట్టడాల్లో ఒక్కటైన నేలకొండపల్లి బౌద్ధ స్థూపాన్ని పరిరక్షించేందుకు పర్యాటక అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ బౌద్ధస్థూపం చుట్టూ పార్కును ఏర్పాటు చేసి పర్యాటకులకు(Tourists) ఆహ్లాదకరంగా ఉండే రూపొందించారు. ఇప్పటికీ బౌద్ధ బిక్షువులు ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేసుకుంటారు. 2వ శతాబ్ధం నాటి ఈ కట్టడాన్ని చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. ఖమ్మం వైపుగా వచ్చే వారు ఈ పురాతన కట్టడాలను సందర్శిస్తుంటారు.
ఇండికా గ్రంథంలో నేలకొండపల్లి ప్రస్తావన
నేలకొండపల్లి అనగానే గుర్తొచ్చే మరో పేరు భక్తరామదాసు(Bakta Ramadas). భద్రాచలం(Bhadrachalam)లో శ్రీరాముడికి గుడి కట్టించిన పరమ భక్తుడు రామదాసు. రామదాసు క్రీ.శ.1664లో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించారు. క్రీ.శ.2వ శతాబ్దంలో నేలకొండపల్లిలో బౌద్ధస్థూపాలు నిర్మించారు. దక్షిణ భారతదేశానికి ఇక్కడ నుంచే బౌద్ధ విగ్రహాల పంపిణీ చేశారని చరిత్ర చెబుతోంది. నేలకొండపల్లి అంటే నెలసెండా అనే పట్టణం అని, 2వ శతాబ్దంలోనే టోలమీ రాసిన ఇండికా గ్రంథంలో నేలకొండపల్లి ప్రస్తావన వచ్చింది. నేలకొండపల్లి చరిత్ర 2 వేల సంవత్సరాలది అని చరిత్ర చెబుతోంది. పాండవులు 12 ఏళ్ల వనవాసం తర్వాత అజ్ఞాతవాసం కోసం ఉత్తరభారతం నుంచి దక్షిణభారత ప్రాంతానికి వచ్చారని, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్ద విరాటరాజు రాజ్యం ఉండేదని అంటుంటారు.
చరిత్రలో ప్రధాన పట్టణం
నేలకొండపల్లి చరిత్రలో ఒక ప్రధాన పట్టణం. దక్కన్ ప్రాంతంలో అతి పెద్ద బౌద్ధ స్థూపాలలో ఒకటి ఇక్కడ కనుగొన్నారు. అలాగే గ్రామం చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న శాతవాహనుల కాలం నిర్మాణాలు ఉన్నాయి. వ్యవసాయ క్షేత్రాల మధ్య పురాతన మానవ నిర్మిత సరస్సు పక్కన ఉన్న మహా స్థూపం (మహాచైత్య) ఇటుకలతో కప్పబడిన విహార సముదాయం, బావులు, నీటి తొట్లతో కలిసి ఉంది. ఈ ప్రదేశం సమీపంలో, పురావస్తు త్రవ్వకాల్లో టెర్రకోట బొమ్మలు, హిందూ రాజవంశాల వందలాది నాణేలు, బుద్ధుని కాంస్య విగ్రహం సున్నపురాయితో చెక్కబడిన చిన్న నమూనా స్థూపం కూడా బయటపడింది. నేలకొండపల్లి ఖమ్మం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో, సూర్యాపేటకు 58 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఇది NH-365Aతో జాతీయ రహదారి గ్రిడ్‌కు అనుసంధానించి ఉంది. ఖమ్మం నుంచి కోదాడ కూసుమంచి మధ్య లింక్ లో ఉంటుంది.