Khammam: ఉక్రెయిన్ నుంచి పెంపుడు పిల్లి ఖమ్మంకు, మూడు రోజులు నెత్తిన పెట్టుకొని - ఇక్కడికొచ్చాకే అసలు ట్విస్ట్!
Khammam Cat: యువకుడు అతి కష్టమ్మీద ఉక్రెయిన్ నుంచి బయటపడ్డాడు. తంటాలుపడి పెంపుడు పిల్లిని కూడా తనతో పాటు తెచ్చుకున్నాడు. ఇక్కడికి వచ్చాక అసలు సమస్య మొదలైంది.
Ukraine War Updates: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు, విదేశీయులు యుద్ధ భయంతో ఎప్పుడెప్పుడు బయట పడదామా అని బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. బయటికి వెళ్లే మార్గాలు లేక బంకర్లలో తలదాచుకుంటున్నారు. కొందరు అతి కష్టమ్మీద పక్క దేశాల సరిహద్దులు దాటి అక్కడి నుంచి ఆయా దేశాలు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక విమానాల ద్వారా సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అయితే, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అతి కష్టమ్మీద తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా తన పెంపుడు జంతువును కూడా విమానంలో తెచ్చుకున్నాడు. దాన్ని అనుమతించకపోయినా ప్రత్యేకంగా ఛార్జీలు చెల్లించి మరీ దాన్ని తనతో పాటు తెచ్చుకున్నాడు. అయితే, ఇక్కడికి వచ్చాక అసలు సమస్య మొదలైంది.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన పుదూరు ప్రఖ్యాత్ అనే వ్యక్తి ఉక్రెయిన్‌లో ఉంటున్నాడు. అక్కడ మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఉక్రెయిన్ లోని ఇవానో ఫ్రాన్ క్వివ్‌లో మెడిసిన్ చదువుతున్నాడు. అయితే, అక్కడ జరుగుతున్న యుద్ధం నేపథ్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మూడు రోజుల పాటు ‘సాంజ’గా పిలుచుకొనే తన పెంపుడు పిల్లిని నెత్తి మీద పెట్టుకొని ప్రయాణించి ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్నాడు. అక్కడి నుంచి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల ద్వారా హైదరాబాద్ కు చేరుకున్నాడు. మరో రెండు నెలల్లో తన చదువు పూర్తి కావాల్సి ఉందని.. కానీ ఈలోపే అక్కడ యుద్ధం ప్రారంభం కావటంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం స్వదేశానికి వచ్చేసినట్లు తెలిపాడు. 200 మంది విద్యార్థులతో వచ్చిన విమానంలో తన పిల్లిని కూడా వెంట తీసుకువచ్చాడు. అయితే, ఢిల్లీ నుంచి విమానంలో పిల్లిని అనుమతించలేదు. దీంతో తనకు రూ.15 వేలతో, పిల్లికి రూ.6 వేలతో టికెట్ కొని హైదరాబాద్‌కు చేరుకున్నాడు.
పిల్లిని నెత్తి మీద పెట్టుకొని కాలినడకన
యుద్ధం జరుగుతున్న వేళ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మూడు రోజుల పాటు కష్టపడి ఇవానో ఫ్రాన్ క్వివ్ నుండి ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకోవటానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ప్రఖాత్ తెలిపాడు. చలిలో తిండి లేకుండా పిల్లిని నెత్తిమీద పెట్టుకుని తీసుకు వచ్చానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి తన పెంపుడు పిల్లిని కష్టపడి కాపాడుకొని ఇక్కడికి తీసుకువస్తే అది ఇక్కడ తెగ ఇబ్బంది పడుతోందని చెప్పాడు. ఇక్కడి అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేకపోతోందని, పిల్లి భయపడుతుందని చెప్పాడు. తడి బట్టతో గంటకోసారి దాన్ని తుడుస్తూ కాపాడుతున్నామని ప్రఖ్యాత్ తెలిపాడు. తన కాలేజీలో ప్రొఫెసర్ తనకు ఈ పిల్లిని బహుమతిగా ఇచ్చిందని తెలిపాడు. అక్కడ దాన్ని అల్లరుముద్దుగా పెంచుకున్నానని చెప్పాడు. అందుకే దాన్ని అక్కడే వదిలేయలేక తనతోపాటు తీసుకువచ్చానని చెప్పాడు.