Why KCR Back : ఏమీ తేల్చుకోకుండానే ఢిల్లీ నుంచి వెనక్కి కేసీఆర్ .. విమర్శలు ప్రారంభించిన విపక్షాలు !
ధాన్యం కొనుగోలుపై తాడోపేడో తేల్చుకుని వస్తానని చాలెంజ్ చేసి ఢిల్లీకి వెళ్లినా కేసీఆర్.. ఎవరితోనూ సమావేశం కాకుండానే వచ్చేశారు. దీంతో కేసీఆర్‌పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో తాడో పేడో తేల్చుకునే వస్తామని .. చీఫ్ సెక్రటరీ సహా మంత్రులతో వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఎవరితో భేటీ కాకుండానే ఏమీ తేల్చుకోకుండానే తిరిగి వచ్చారు., ఢిల్లీ వెళ్లే ముందు ఆయన చేసిన ప్రకటనలకు.. ఢిల్లీలో జరిగిన వాటికి అసలు పొంతనే లేకపోవడంతో సహజంగానే విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ ఢిల్లీలో ఏం చేశారు ? వరి ధాన్యం విషయంలో కొనుగోలుపై కేంద్రంపై ఒత్తిడి చేశారా ? లేక జాతీయ రాజకీయాల కోసం సీక్రెట్ భేటీలు ఏమైనా నిర్వహించారా ?
Also Read : ఖమ్మంలో వామపక్షాలతో టీఆర్ఎస్ దోస్తీ.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు ప్లాన్ !
వరి ధాన్యం కొనుగోలుపై తేల్చుకుంటామని సవాల్ చేసి మరీ ఢిల్లీకి !
యాసంగి సీజన్‌లో రైతులు ఏ పంటలు వేయాలన్న దానిపై కేంద్రం నుంచి క్లారిటీ తీసుకుంటానని, ఆ తర్వాతనే వివరంగా చెప్పగలనని, సమగ్ర సాగు ప్రణాళిక రూపొందించుకోవడం సాధ్యమవుతుందని సీఎం ఢిల్లీ వెళ్లే ముందు రోజు ప్రెస్‌మీట్‌లో చెప్పారు.కేంద్రం ఎంత త్వరగా తేలిస్తే రైతులకు అంత ఉపశమనం ఉంటుందని కూడా పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు అంశంమీదనే ఢిల్లీ వెళ్లినప్పటికీ కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్‌తో జరిగిన భేటీకి కేసీఆర్ హాజరుకాలేదు. ప్రధానమైన సమస్య అని చెప్తూనే దానిపై చర్చించడానికి ఎందుకు చొరవ తీసుకోలేదని, కేవలం మంత్రుల్ని, అధికారులను మాత్రమే పంపి గైర్హాజరు కావడానికి కారణలేంటనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
Also Read : తెగువతో పని చేస్తే తెలంగాణలో మనదే అధికారం.. పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సందేశం !
నాలుగు రోజులున్నా ఎవరితోనూ సమావేశం కాని సీఎం !
రాష్ట్రానికి సంబంధించిన జల వివాదాల మొదలు విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలు, కేంద్ర ప్రభుత్వ హామీలపై అందర్నీ కలుస్తానన్నారు . కానీ అలాంటిదేమీ జరగలేదు. కేంద్ర మంత్రులు, ప్రధానిని కలువకుండానే కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నా .. కేసీఆర్ అధికారికంగా ఎవరినీ కలవలేదు. నాలుగు రోజులు ఢిల్లీలో ఉన్నా ఎవరికీ కలవకపోవడంతో విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. అధికారిక పర్యటన కోసమే వెళ్లారా? లేకా వ్యక్తిగతమా? అని ప్రశ్నిస్తున్నారు. ఆపాయింట‌్మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నారని కానీ ఎవరూ ఇవ్వడం లేదని.. తెలంగాణను బీజేపీ కేంద్రమంత్రులు అవమానిస్తున్నారని.. తెలంగాణలో ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి మంత్రులు ప్రకటనలు చేశారు. కానీ అసలు కేసీఆర్ ఎవరినీ కలిసే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
3గంటల దీక్ష చేసి ఢిల్లీకి పోయి తాడోపేడో తేల్చుకుంటానని చెప్పిన KCR కథ
— YS Sharmila (@realyssharmila) November 25, 2021
3ఏండ్లు కర్రసాము నేర్చి మూలకున్న ముసల్దాన్ని కూడా కొట్టలేని తీరు అయింది.
ఢిల్లీకి పోయి పొడుస్తమ్ అని ప్రెస్ మీట్ లు పెట్టిన దొర ఉత్తి చేతులతో తిరిగొచ్చాడు.
అపాయింట్ మెంట్ లేకుండానే ఏం పొడుస్తారని పోయారు?1/2 pic.twitter.com/9wbE320gdZ
Also Read : కలెక్టర్ వాహనంపై 28 చలానాలు... వార్త వైరల్ అవ్వడంతో 15 చలానాలు చెల్లింపు..
దీదీకి మోడీ అపాయింట్‌మెంట్.. అడిగితే కేసీఆర్‌కు ఇవ్వరా ?
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అపాయింట్‌మెంట్ ఇచ్చిన ప్రధాని మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎందుకు ఇవ్వకుండా ఉంటారననే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీ ఢిల్లీకి వచ్చి నరేంద్రమోడీతో సమావేశం అయ్యారు. మమతా బెనర్జీకి అడగగానే సమయం ఇచ్చి కేసీఆర్‌ను మాత్రం దూరం పెట్టే అవకాశాలు లేవు. ఎందుకంటే గతంలో కేసీఆర్ రాజకీయంతా అత్యంత క్లిష్టమైన సమయాల్లోనూ మోడీ, షా అపాయింట్ మెంట్లు తీసుకున్నారు. తెలంగాణలో బీజేపీకి ఇబ్బందికరం అవుతుందని తెలిసినా కేసీఆర్ అడిగారని మోడీ,షా అపాయింట్ మెంట్లు ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఎలాంటి రాజకీయ క్లిష్ట పరిస్థితి లేనప్పటికీ అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఉండటానికి అవకాశం లేదని గుర్తు చేస్తున్నారు.
Also Read: ఫకీర్ మాటలు బంద్ చేయండి.. సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలో అలా అవమానం: మంత్రి ఎర్రబెల్లి
వ్యక్తిగత పర్యటన కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారా?
ఢిల్లీ పర్యటన ఉద్దేశం బియ్యం కొనుగోలు అంశం కాదని.. కేసీఆర్ ఇంకేదో రాజకీయం చేశారని కొంత మంది అనుమానిస్తున్నారు. రేవంత్ రెడ్డి వంటి వారు ఇవే ఆరోపణలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ వ్యవహారం మొత్తం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కుదిరిన ఓ మ్యాచ్ ఫిక్సింగ్ అని, ఈ రెండు పార్టీలూ కలిసి ఆడుతున్న నాటకం అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడానికి ముందు ఆయన సతీమణి వైద్య పరీక్షల కోసం ఢిల్లీ వెళ్లారు. బహుశా.. ఆమె వైద్యం విషయాలు దగ్గరుండి చూసుకుంటున్నారేమోనని కొంత మంది అంచనా వేస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రకటించిన దానికి.. ఢిల్లీ వెళ్లి చేసిన దానికి పొంతన లేకపోవడంతోనే విమర్శలు వస్తున్నాయి. వీటిపై టీఆర్ఎస్ నేతలు పెద్దగ స్పందించడం లేదు.
Also Read : సాయం కోసం రైతు కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయి.. వాళ్లే భారమయ్యారా?